Share News

తిరుమలలో యాత్రికుల వద్దకే జలప్రసాదం

ABN , Publish Date - Apr 09 , 2026 | 05:14 AM

తిరుమల యాత్రికులకు వేసవి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. భక్తుల వద్దకే నీటిని తీసుకెళ్లి అందించేలా చర్యలు తీసుకుంది.

తిరుమలలో యాత్రికుల వద్దకే జలప్రసాదం

  • క్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్న శ్రీవారి సేవకులు

తిరుమల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల యాత్రికులకు వేసవి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. భక్తుల వద్దకే నీటిని తీసుకెళ్లి అందించేలా చర్యలు తీసుకుంది. ప్లాస్టిక్‌ నిషేధంలో భాగంగా ఇప్పటికే తిరుమలలో వాటర్‌ బాటిళ్ల విక్రయాలను టీటీడీ రద్దు చేసింది. కేవలం గాజు బాటిళ్లను మాత్రమే కొండపై విక్రయిస్తున్నారు. బరువుగా ఉండే ఈ బాటిళ్లను వినియోగించేందుకు చాలామంది భక్తులు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల వద్దకే తాగునీటిని సరఫరా చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు భావించారు. ఈ క్రమంలో హెల్త్‌ విభాగం డిప్యూటీ ఈవో సోమన్నారాయణ 15 లీటర్ల నీటి క్యాన్లను తయారు చేయించారు. ఈ క్యాన్లను శ్రీవారి సేవకులు భుజాలకు తగిలించుకుని స్టీల్‌ గ్లాసుల్లో నీరు నింపి భక్తులకు అందజేస్తున్నారు. గతేడాది బ్రహ్మోత్సవాల సమయంలోనే కొద్దిరోజుల పాటు వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు రావడంతో దాదాపు 100 క్యాన్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో 60 మంది శ్రీవారి సేవకులతో వీటి ద్వారా నీటిని అందజేస్తున్నారు. కొన్ని మార్పులతో ఈ కార్యక్రమాన్ని సీజన్‌తో సంబంధం లేకుండా నిరంతరం అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.

Updated Date - Apr 09 , 2026 | 05:14 AM