Share News

తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే కఠినచర్యలు

ABN , Publish Date - Mar 01 , 2026 | 06:10 AM

ఎంతో భక్తితో తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీసినా, తిరుమల పవిత్రతను అప్రతిష్టపాల్జేసినా కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు హెచ్చరించారు.

తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే కఠినచర్యలు

  • రూ.5,456.26 కోట్ల అంచనాలతో టీటీడీ బడ్జెట్‌

  • త్వరలో ‘శ్రీవారి ముడుపు పత్రం పథకం’

  • మొత్తం 85 అంశాలపై తీర్మానాలు: చైర్మన్‌ బీఆర్‌ నాయుడు

తిరుమల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఎంతో భక్తితో తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీసినా, తిరుమల పవిత్రతను అప్రతిష్టపాల్జేసినా కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు హెచ్చరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూ.5,456.26 కోట్ల్ల అంచనాలతో ఆమోదించినట్టు ఆయన వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శనివారం జరిగింది. అనంతరం ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, కొంతమంది సభ్యులతో కలిసి బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు. ధర్మకర్తల మండలి సమావేశంలో మొత్తం 85 అంశాలపై చర్చించి తీర్మానాలు చేశామని తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ బోర్డు సబ్‌ కమిటీ సిఫారసుల మేరకు టీటీడీ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు రూ.118.89 కోట్లు కేటాయించామన్నారు. డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, అదనపు హాస్టల్‌ బ్లాకులు, కిచెన్ల ఆధునికీకరణ, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆమోదం తెలిపామన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం ‘శ్రీవారి ముడుపు పత్రం పథకం’ ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇక, తిరుమలలోని మ్యూజియం పనులు చివరిదశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కాగా.. బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామాను ధర్మకర్తల మండలి తిరస్కరించింది..


‘పరాభవ’ పంచాంగం ఆవిష్కరణ

ఈ సమావేశంలోనే శ్రీపరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. రూ.75 విలువైన ఈ పంచాంగం తిరుపతిలో, తిరుమలలో ఆదివారం నుంచి భక్తులకు అందుబాటులో ఉండనుంది. మిగతా టీటీడీ సమాచార కేంద్రాల్లో వచ్చే వారం అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.


సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..

  • రిలయన్స్‌ సంస్థ సహకారంతో దాదాపు రూ.120 కోట్లతో నూతన టెక్నాలజీతో ఆధునిక వంటశాల పనుల ప్రారంభానికి ఆమోదం

  • ఆలయాలు, ప్రాకారాలు, రాజగోపురాల నిర్మాణాల ఖర్చు దృష్ట్యా శ్రీవాణి ట్రస్టు మార్గదర్శకాల్లో మార్పులు

  • సీఎం ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహ నిర్మాణం కోసం డ్రై ఐల్యాండ్‌ నిర్మాణానికి రూ.20.17 కోట్లు కేటాయింపు

  • ఏప్రిల్‌ 1న ఒంటిమిట్టలో జరగనున్న సీతారాముల కల్యాణానికి వచ్చే దాదాపు 70 వేల మంది భక్తులకు రూ. 50 విలువైన తిరుమల శ్రీవారి లడ్డూ ఉచితంగా అందించాలని నిర్ణయం

  • కోయంబత్తూరు, గువహటి, బెలగావి, పాట్నా వద్ద మోకామ నగరంలో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ఆయా రాష్ర్టాలు కేటాయించిన భూమిని తీసుకునేందుకు ఆమోదం

  • తిరుపతిలోని వకుళమాత ఆలయం లో ‘అక్షర గోవిందం’ పేరుతో అక్ష్యరాభాస్యం ప్రారంభించాలని నిర్ణయం

  • ఆర్మీ వెల్ఫేర్‌ ప్లేస్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా తిరుపతిలో 356, తిరుమలలో 371 మంది భద్రతా సిబ్బంది నియామకానికి ఆమోదం

  • అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో లేటెస్ట్‌ ఎక్స్‌రే బ్యాగేజ్‌ స్కానర్లు, డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్ల ఏర్పాటుకు నిర్ణయం

  • టీటీడీ ఆలయాల్లో 51మంది పరిచారకులకు అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం

  • పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీవేంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణానికి రూ.14.25 కోట్లు కేటాయింపు

Updated Date - Mar 01 , 2026 | 06:11 AM