శ్రీవారి కైంకర్యాలకుఅర్చకులు కావలెను!
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:01 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకుల కొరత తీవ్రంగా ఉంది. గతంలో పనిచేసిన వారితో పోలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోవడంతో ఉన్న అర్చకులపైనే భారం పడుతోంది.
గోవిందరాజస్వామివారి ఆలయంలో పనిచేస్తున్న 17 మందికి పదేళ్లుగా డిప్యుటేషన్‌పై విధులు
కొరత కారణంగా ఉన్నవారిపై పెరుగుతున్న ఒత్తిళ్లు
వయోభారం, ఆరోగ్య సమస్యలతో పలువురు సతమతం
సత్వరమే ఖాళీలు భర్తీ చేయకుంటే సేవలపై ప్రభావం
(తిరుపతి(టీటీడీ)/తిరుమల- ఆంధ్రజ్యోతి)
తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకుల కొరత తీవ్రంగా ఉంది. గతంలో పనిచేసిన వారితో పోలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోవడంతో ఉన్న అర్చకులపైనే భారం పడుతోంది. వాస్తవానికి కొవిడ్ సమయంలోనూ శ్రీవారి ఆలయాన్ని మూసివేయలేదు. స్వామికి జరగాల్సిన కైంకర్యాలను అప్పట్లో ఏకాంతంగానే నిర్వహించారు. ఆ ఏడాది బ్రహ్మోత్సవాలను సైతం ఆలయం లోపలే జరిపారు. ఎన్ని ఆటంకాలు, ఉపద్రవాలు ఎదురైనా శ్రీవారికి కైంకర్యాలను కొనసాగిస్తారని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఈ నేపథ్యంలో అర్చకుల కొరత ఏర్పడితే స్వామివారి సేవలపై ప్రభావం పడే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖాళీగా ఉన్న అర్చకుల పోస్టులను సత్వరమే భర్తీ చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరుమల ఆలయంలో కైంకర్యాల నిర్వహణకు గతంలో 60 మంది అర్చకులు పనిచేసేవారు. ప్రస్తుతం 44 మంది మాత్రమే ఉండటంతో గత పదేళ్లుగా గోవిందరాజస్వామివారి ఆలయంలో పనిచేస్తున్న 17మందిని డిప్యుటేషన్‌పై వినియోగించుకుంటున్నారు. శ్రీవారికి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం కైంకర్యాలు జరుతుంటాయి. ఇందుకోసం టీటీడీ పరీక్ష లు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది.
నాటి ఎఫ్‌ఏ అండ్ సీఏవో అడ్డుపుల్ల
అర్చకుల పోస్టులు భర్తీచేసేందుకు గతంలో నోటిఫికేషన్ జారీ చేయాలని భావించినా గత వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్‌ఏ అండ్ సీఏవోగా వ్యవహరించిన బాలాజీ అడ్డుకట్ట వేశారన్న వాదనలున్నాయి. ఇప్పటికే అర్చకుల వేతనాలు ఎక్కువయ్యాయని, మరికొందరిని తీసుకుంటే భారం పెరుగుతుందని ఆయన ఫైల్‌ను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. అర్చకులు సైతం 8 గంటల విధుల పరిధిలోకి వస్తారని, అందువల్ల కైంకర్యాలు, ఇతర కార్యక్రమాల సమయంలో నలుగురు చొప్పున ఉన్నా సరిపోతారని కొందరు అధికారులు వాదించారని సమాచారం. దీనివల్ల ఉన్న అర్చకులతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే వీరిలో అనేకమంది వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం సుప్రభాత సేవకు వెళ్లే అర్చకులు తిరిగి ఉదయం 6.30గంటల తర్వాతే బయటకు వస్తారు. ఈ మధ్యలో కనీసం మూత్ర విసర్జనకు సైతం వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ మధ్యలో బయటకు వెళ్తే మళ్లీ శుచిగా స్నానం చేసి దుస్తులు మార్చుకుని లోపలకు రావాల్సిందే. అంత పవిత్రంగా, ఎంతో నిష్ఠతో శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొరత కారణంగా యువ అర్చకులను ఎక్కువ రొటేషన్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఇప్పుడు పనిచేస్తున్న అర్చకుల కుటుంబాల నుంచి గతంలో 10మందిని పరీక్షల ద్వారా ఎంపిక చేశారు. ఇంకా పదవీ విరమణ చేసిన 7 పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా చెబుతున్నారు. వీటిని కూడా భర్తీ చేస్తే ప్రస్తుతం ఉన్న అర్చకులపై భారం తగ్గుతుందంటున్నారు.
స్వామికి చేసే సేవల జాబితా...
తిరుమల ఆలయంలో శ్రీవారికి రోజూ సుప్రభాతం, తోమాల, అర్చన, కొలువు/ పంచాంగ శ్రవణం (ఏకాంతం), విశేష పూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవ, ఏకాంత సేవలు జరుగుతుంటాయి. వీటితో పాటు వారంలో ఒకరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళపాదపద్మారాధన సేవ, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం, వస్త్రాలంకరణ సేవ, నిజపాద దర్శనం ఉంటాయి. శ్రీవారి ఆలయంలో నిత్య కల్యాణోత్సవం జరుగుతుంది. ఏటా మార్చి నెలలో 5 రోజుల పాటు తెప్పోత్సవం, మార్చి/ ఏప్రిల్‌లో వసంతోత్సవం, మే నెలలో 3 రోజులపాటు పద్మావతీ పరిణయోత్సవాలు, జూన్‌లో అభిదేయక అభిషేకం (జ్యేష్టాభిషేకం), జూలైలో పుష్పపల్లకీ, నవంబరులో పుష్పయాగం నిర్వహిస్తారు. ఏడాదిలో 4 రోజులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆగస్టులో 3రోజుల పాటు పవిత్రోత్సవాల సేవలు జరుగుతాయి. దసరా నవరాత్రుల్లో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరింత ప్రత్యేకం.