శ్రీవారి ఆలయంలో పురాతన మండపాల సంరక్షణ
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:18 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో పురాతన మండపాల్లోని రాతి స్తంభాలు, రాతి పైకప్పును శుభ్రపరచడంతో పాటు పగుళ్లను శాస్త్రీయపద్ధతుల్లో సరిచేసి సంరక్షించేందుకు పూణేకు చెందిన ఓ సంస్థ ముందుకు వచ్చింది.
ముందుకొచ్చిన పుణే ట్రస్టు
స్తంభాలు, పైకప్పు శుద్ధి, రక్షణ పనులకు టీటీడీ బోర్డు ఆమోదం
తిరుమల, మార్చి 9(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో పురాతన మండపాల్లోని రాతి స్తంభాలు, రాతి పైకప్పును శుభ్రపరచడంతో పాటు పగుళ్లను శాస్త్రీయపద్ధతుల్లో సరిచేసి సంరక్షించేందుకు పూణేకు చెందిన ఓ సంస్థ ముందుకు వచ్చింది. పూర్తిగా విరాళం పద్ధతిలో ఈ పనులు చేపట్టేందుకు ఆ ట్రస్టు సిద్ధమైన క్రమంలో టీటీడీ బోర్డు కూడా ఇటీవల ఆమోదం తెలిపింది. ఆలయంలోని రంగనాయక మండపం, కల్యాణోత్సవ మండపం, పాత పరకామణి మండపాల్లో పురాతన రాతి స్తంభాలు, రాతి ఉపరితలం, ఇతర రాతి నిర్మాణాలను కొన్ని రకాల రసాయనాలతో శుభ్రపరచడంతో పాటు పగుళ్లను అరికట్టి సంరక్షించేందుకు పూణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర ఝ్ఛరిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్టు(ఎల్వీసీఆర్టీ) ముందుకొచ్చింది. ఈ పనులకయ్యే ఖర్చు మొత్తం ఆ ట్రస్టు భరిస్తుందని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం బోర్డు దృష్టికి తీసుకురావడంతో గతనెల 28వ తేదీన జరిగిన సమావేశంలో ఆమోదం లభించింది. కాగా, ఇదే ట్రస్టు ప్రస్తుతం అలిపిరి పాదాల మండపాన్ని శాస్ర్తీయ పద్ధతిలో పునర్నిర్మాణ పనులు చేస్తున్న విషయం తెలిసిందే.