చెన్నై ట్రావెల్స్ ఏజెన్సీకి భారీగా శ్రీవాణి టికెట్లు
ABN , Publish Date - May 12 , 2026 | 05:16 AM
టీటీడీ రోజూ ఉదయం ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసే శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు నానా ఇబ్బందులు పడుతుంటే ఓ ట్రావెల్ ఏజెన్సీ మాత్రం భారీగా టికెట్లు పొంది బ్లాక్‌లో విక్రయిస్తోంది.
ఒక్కో టికెట్ రూ.13,500కు విక్రయం.. విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి
తిరుమల, మే 11 (ఆంధ్రజ్యోతి): టీటీడీ రోజూ ఉదయం ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసే శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు నానా ఇబ్బందులు పడుతుంటే ఓ ట్రావెల్ ఏజెన్సీ మాత్రం భారీగా టికెట్లు పొంది బ్లాక్‌లో విక్రయిస్తోంది. రూ.10,500 విలువ కలిగిన టికెట్‌ను రూ.13,500కు విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నట్టు టీటీడీ విజిలెన్స్ తనిఖీల్లో బయటపడింది. చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్స్ సంస్థకు చెందిన ఒకే నంబరు నుంచి అత్యధికంగా శ్రీవాణి టికెట్లను పొందుతున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆ సంస్థ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లోనూ మొదటి గడప దర్శనం రూ.13,500కు కేటాయిస్తామని ప్రకటనలు చేయడాన్ని కూడా గమనించారు. ఈ క్రమంలో ఏవీఎస్వో వెంకట నగేష్ బృందం ఈ నెల 6వ తేదీ శ్రీవారి ఆలయం బయోమెట్రిక్ వద్ద తనిఖీలు నిర్వహించింది. చెన్నైకి చెందిన కాళిదాసన్, గోపి నలుగురి కోసం ఆ సంస్థకు చెందిన అన్బు అనే వ్యక్తికి రూ.54 వేలు బదిలీ చేసి మూడు టికెట్లు పొందినట్టు తనిఖీల్లో గుర్తించారు. అలాగే విజయ్ అనే వ్యక్తి ముగ్గురి కోసం రూ.40 వేలు ఆన్‌లైన్ ద్వారా పంపినట్టు గుర్తించారు. నిమిషాల్లో పూర్తయ్యే రోజువారీ 800 టికెట్ల కోటాలో ఈ ట్రావెల్స్ ఏజెన్సీకి మాత్రం ఎలా అధికంగా టికెట్లు లభిస్తున్నాయి, ఎప్పటినుంచి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు అనే అంశాలపై విచారించాలని కోరుతూ విజిలెన్స్ అధికారులు తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.