Share News

తిరుమలలో ‘పాము కాటు’ ప్రచారం

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:19 AM

తిరుమలలో క్యూలైన్‌లో ఓ భక్తురాలిని పాము కాటేసిందని జరిగిన ప్రచారం సోమవారం కలకలం సృష్టించింది.

తిరుమలలో ‘పాము కాటు’ ప్రచారం

  • క్యూలైన్‌లో పాము కాటేసిందంటూ ప్రచారం

  • ఆ ప్రచారం అవాస్తవమని పేర్కొన్న టీటీడీ

తిరుమల, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తిరుమలలో క్యూలైన్‌లో ఓ భక్తురాలిని పాము కాటేసిందని జరిగిన ప్రచారం సోమవారం కలకలం సృష్టించింది. వివరాలు.. తెలంగాణా రాష్ట్రం వరంగల్‌ జిల్లాకు చెందిన శరత్‌బాబు, మౌనిక దంపతులు బంధువులతో కలిసి శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి తిరుమలకు వచ్చారు. దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2కు సమీపంలోని ఆర్బీ సెంటర్‌ వద్దనున్న కార్‌ పార్కింగ్‌ వద్దకు చేరుకున్నారు. మౌనిక పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లిన క్రమంలో కాలుపై ఏదో పాకినట్టు అన్పించడంతో భయపడింది. భర్తతో కలిసి పరిశీలించగా చిన్నపాము కనిపించింది. భద్రతా సిబ్బందికి సమాచారమివ్వడంతో తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. కాగా.. దర్శన క్యూలైన్‌లో ఓ భక్తురాలికి పాము కాటు అని జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. అశ్విని ఆస్పత్రిలో మౌనికను పరీక్షించిన వైద్యులు ఎలాంటి పాము కాటు లేదని నిర్ధారించారని, అయినా స్విమ్స్‌ ఆస్పత్రికి పంపామని తెలిపింది. సోమవారం ఉదయం వారు శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారని పేర్కొంది.

Updated Date - Feb 24 , 2026 | 04:21 AM