కిక్కిరిసిన తిరుమల
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:44 AM
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో యాత్రికులతో కిటకిటలాడుతోంది. శనివారం వేకువజాము నుంచే భక్తుల సంఖ్య పెరిగింది.
తిరుమల, జూలై 11(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో యాత్రికులతో కిటకిటలాడుతోంది. శనివారం వేకువజాము నుంచే భక్తుల సంఖ్య పెరిగింది. సాయంత్రానికి కొండ మొత్తం కిక్కిరిసిపోయింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, రోడ్లు, ప్రధాన కూడళ్లు, లడ్డూ కేంద్రం, అఖిలాండం, కల్యాణకట్టలు, గదులు కేటాయించే రిసెప్షన్ కౌంటర్లు, యాత్రికుల వసతి సముదాయాలు రద్దీగా మారిపోయాయి. గదులు లభించని భక్తులు కార్యాలయాల ముందు, షెడ్లలో, చెట్ల కింద సేదదీరుతున్నారు. ఇక, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం నుంచి రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్ మీదుగా బాటగంగమ్మ, అక్టోపస్ భవనం, పాచికాల్వ గంగమ్మ ఆలయం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. క్యూలైన్లు నిండిన వెంటనే ప్రవేశద్వారాన్ని మూసివేస్తున్నారు. క్యూలైన్లు ఖాళీ అయిన తర్వాత తిరిగి సర్వదర్శన భక్తులను అనుమతిస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి 52 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు బారులుతీరాయి. హారన్ల మోతతో తిరుమల, అలిపిరి పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కేటాయించే కేంద్రాలు, లగేజీ కౌంటర్లు, అలిపిరి పాదాల మండపం, కాలినడక మార్గాలు కూడా యాత్రికులతో రద్దీగా కనిపించాయి.