Share News

కొండపై లక్షన్నర మంది!

ABN , Publish Date - Jun 28 , 2026 | 04:06 AM

తిరుమల కొండ కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శనివారం రికార్డు స్థాయిలో దాదాపు లక్షన్నర మంది స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.

కొండపై లక్షన్నర మంది!

  • తిరుమలలో దర్శనానికి వేచి ఉన్న భక్తజనం

  • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

  • రేపు బ్రేక్‌, శ్రీవాణి దర్శనాలు రద్దు: టీటీడీ

తిరుమల, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): తిరుమల కొండ కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శనివారం రికార్డు స్థాయిలో దాదాపు లక్షన్నర మంది స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో ఆక్టోపస్‌ భవనం సర్కిల్‌ వరకు క్యూలైన్‌ వ్యాపించింది. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా, నిరీక్షణ సమయాన్ని తగ్గించేలా క్యూలైన్‌ నిండిన వెంటనే ప్రవేశ ద్వారాన్ని మూసివేస్తున్నారు. క్యూలైన్‌లోని భక్తులు పూర్తిగా షెడ్లు, కంపార్టుమెంట్లలోకి చేరుకున్న తర్వాత తిరిగి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు భక్తులు తమను క్యూలోకి అనుమతించాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. క్యూలైన్‌ వద్దకు భారీగా చేరుకున్న భక్తులను ఉచిత బస్సుల ద్వారా యాత్రికుల వసతి సముదాయాలకు తరలించారు. మరోవైపు గదులు కేటాయించే రిసెప్షన్‌ కేంద్రాలు, కల్యాణకట్టలు కిటకిటలాలడాయి. శనివారం సాయంత్రం 5 గంటల సమయానికే 9వేల వాహనాలు కొండపైకి వచ్చాయి. వాహనాల రద్దీ అధికం కావడంతో ట్రాఫిక్‌ సమస్యలు పెరిగాయి. స్లాటెడ్‌ సర్వదర్శనం (ఎస్‌ఎ్‌సడీ) టోకెన్ల కోసం భక్తులు అవస్థలు పడ్డారు. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం సముదాయాల్లోని కౌంటర్లతో పాటు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌ కౌంటర్ల వద్ద బారులు తీరారు. ఆదివారం దర్శనానికి సంబంధించి శనివారం ఉదయం 9నుంచి 11గంటల మధ్య 10వేల ఎస్‌ఎ్‌సడీ, 2 వేల దివ్యదర్శనం (డీడీ) టోకెన్లు జారీ చేశారు. అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాలు, లగేజీ కేంద్రాలు కూడా రద్దీగానే కనిపించాయి.


టైంస్లాట్‌ టోకెన్లు కుదిస్తాం: ఏఈవో

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భారీగా పెరిగిన క్యూలైన్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శనివారం రాత్రి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల మొత్తం భక్తజన సందోహంగా ఉందని చెప్పారు. భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించడంతో పాటు వారికి సౌకర్యం, భద్రతను కల్పించే బాధ్యత తమపై ఉందన్నారు. పోలీసు, విజిలెన్స్‌తో సమయన్వం చేసుకుని పనిచేస్తున్నామని తెలిపారు. క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా సేవలందిస్తున్నామని చెప్పారు. సిబ్బందికి సెలవులు రద్దుచేసి అందరినీ తిరుమలలో విధుల్లో కొనసాగిస్తున్నామని వెల్లడించారు. రద్దీ కొనసాగే అవకాశమున్న నేపథ్యంలో సోమవారం వీఐపీ బ్రేక్‌తో పాటు రోజువారీగా ఆన్‌లైన్‌లో కేటాయించే 800 శ్రీవాణి టికెట్ల కోటాను రద్దు చేశామని వివరించారు. టైంస్లాట్‌ టోకెన్లు కూడా కుదిస్తామని, దీనిద్వారా సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం లభిస్తుందని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులో ఇచ్చే 200 టికెట్ల కోటా యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. టీటీడీ అధికారులు, సిబ్బందికి భక్తులు సహకరించాలని కోరారు.

Updated Date - Jun 28 , 2026 | 04:08 AM