Share News

శ్రీవారికి నేడు సప్తవాహన సేవ

ABN , Publish Date - Jan 25 , 2026 | 05:16 AM

రథసప్తమి వేడుకలకు తిరుమల సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఆదివారం ఒకే రోజు ఏడు వాహనసేవలు జరగనున్నందున శనివారం నుంచే మాడవీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

శ్రీవారికి నేడు సప్తవాహన సేవ

  • రథసప్తమికి తిరుమల ముస్తాబు

  • మాడ వీధులలో భక్తుల రద్దీ

  • ముందు రోజు నుంచే కిటకిటలాడుతున్న గ్యాలరీలు

తిరుమల, జనవరి24(ఆంధ్రజ్యోతి): రథసప్తమి వేడుకలకు తిరుమల సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఆదివారం ఒకే రోజు ఏడు వాహనసేవలు జరగనున్నందున శనివారం నుంచే మాడవీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 5.30గంటలకు మొదలయ్యే వాహనసేవలు రాత్రి 9 దాకా సాగుతాయి. దాదాపు రెండున్నర లక్షలమంది భక్తులు తిరుమలకు చేరుకుంటారని అధికారుల అంచనా. అందుకు తగినట్టుగా వాహనసేవలు నిర్వహించే నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో తొక్కిసలాటలు లేకుండా బారికేడ్లు అమర్చారు.

తెల్లవారుజాము నుంచి వాహనసేవలు

ఆదివారం ఉదయం 5 గంటలకు మలయప్పస్వామి ఆలయం నుంచి వాహనమండపానికి చేరుకుంటారు. అక్కడ సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా వాయవ్య దిక్కుకు చేరుకుని సూర్యోదయం కోసం వేచివుంటారు. భానుడి కిరణాలు మలయప్పను తాకగానే హారతి సమర్పించి వాహనాన్ని ముందుకు కదిలిస్తారు. అప్పటి నుంచి రాత్రి వరకు వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడికి ప్రత్యేక రోజుగా భావించే ఆదివారం రోజే ఈ ఏడాది సూర్యజయంతి రావడం విశేషం. దీంతో సూర్యప్రభపై స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో శనివారం సాయంత్రానికే గ్యాలరీల్లో చేరిపోయారు.

Updated Date - Jan 25 , 2026 | 05:16 AM