వెంకన్ననూ వదల్లేదు!
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:54 AM
మాజీ సీఎం జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్) లీలలు అన్నీ ఇన్నీ కావు. నాడు జగన్ అధికారం అండతో వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేసుకున్న కేఎన్‌ఆర్..
కేఎన్‌ఆర్ బినామీ పేరిట తిరుమలలో పెట్రోల్ బంక్
స్థలాన్ని 15 ఏళ్లు లీజుకిచ్చిన నాటి వైవీ బోర్డు
నెల అద్దె 4.24 లక్షల నుంచి1.90 లక్షలకు తగ్గింపు
15 ఏళ్ల పాటు అద్దె పెంచకూడదని నిర్ణయం
చక్రం తిప్పిన జగన్ పీఏ
కొండపైనే ఐవోసీ స్థలానికి 3.33 లక్షల అద్దె
ఏటా3 శాతం అద్దె పెంపు నిబంధన
దుకాణాలకూ అద్దె పెంపు
కేఎన్‌ఆర్‌కు మాత్రం ‘స్పెషల్’
తిరుమల, మే 31(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్) లీలలు అన్నీ ఇన్నీ కావు. నాడు జగన్ అధికారం అండతో వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేసుకున్న కేఎన్‌ఆర్.. చివరికి కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండనూ విడిచిపెట్టలేదు. తిరుమలలో పెట్రోల్ బంక్‌ను బినామీ పేరిట పొందాడు. తక్కువ ధరకు స్థలాన్ని లీజుకు తీసుకుని స్వామి ఆదాయానికి నష్టం కలిగించేలా నేటికీ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నాడు. పెట్రోల్ బంక్ కోసం స్థలాన్ని నెలకు కేవలం రూ.2.20 లక్షల(జీఎస్టీతో కలిపి) తక్కువ అద్దెతో ఏకంగా 15 ఏళ్లపాటు నాటి వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ బోర్డు లీజుకు కట్టబెట్టింది. అందులోనూ ఎలాంటి అద్దె పెంపు లేకుండా మినహాయింపు ఇచ్చింది. తిరుమల కొండపై ఉన్న పెట్రోల బంక్‌ల స్థలాలకు, దుకాణాలకు టీటీడీ అద్దె పెంచుతుంది. కానీ కేఎన్‌ఆర్ కోసం నాటి బోర్డు అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కింది.
నిబంధనలన్నీ గాలికి...
తిరుమలలో 30 ఏళ్లకుపైగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏఎన్సీ ప్రాంతంలో పెట్రోల్ బంక్‌ను నిర్వహిస్తున్నారు. ఈ బంక్‌కు కేటాయించిన స్థలానికి టీటీడీ నెలకు రూ.4.40 లక్షల (జీఎస్టీతో కలిపి) వరకు అద్దె వసూలు చేస్తోంది. అలాగే ప్రతి మూడేళ్లకోసారి రెన్యువల్, ప్రతి ఏటా మూడు శాతం అద్దె పెంపు వంటి నిబంధనలు పెట్టింది. తమకు తిరుమలలో హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణరావు.. జగన్ సర్కార్ వచ్చిన వెంటనే విన్నవించుకున్నారు. ఈ క్రమంలో 2019 డిసెంబరులో అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మొదట ఆమోదం తెలిపారు. ఐవోసీకి అమలు చేస్తున్న నిబంధనలనే హెచ్‌పీసీఎల్‌కు లీజు మొత్తానికి వర్తింపజేయాలని, ప్రారంభంలో మూడేళ్లపాటు లీజు ఇవ్వాలని అప్పట్లో నిర్ణయించారు. నెల అద్దెను రూ.4.24 లక్షలుగా తొలుత టీటీడీ ఇంజనీరింగ్ విభాగం నిర్ణయించినప్పటికీ.. 2021 డిసెంబరులో వైవీ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో రూ.1.90 లక్షలకే కేటాయించడంతోపాటు 15 ఏళ్లపాటు అద్దె పెంచకూడదని నిర్ణయం తీసుకున్నారు. 8,750 చదరపు అడుగుల స్థలానికి ఐవోసీ దాదాపు 3.33 లక్షల అద్దె చెల్లిస్తుండగా, సుమారు 10 వేల చదరపు అడుగుల స్థలాన్ని హెచ్‌పీసీఎల్‌కు తక్కువ అద్దెకు కేటాయిస్తే ఇబ్బందులు వస్తాయని కొందరు అధికారులు చెప్పినా నాటి బోర్డు పెడచెవిన పెట్టింది. మూడేళ్లకోసారి అద్దెను పెంచే అంశంపై పరిశీలన చేయాలని కొన్ని సలహాలు వచ్చినా వినకుండా 15 ఏళ్లపాటు న్యూ డీటైప్ క్వార్టర్స్ వద్ద ఉన్న రింగురోడ్డు పక్కనే స్థలాన్ని కట్టబెట్టింది. ఇక్కడే ఈవీ స్టేషన్, సీఎన్‌జీ స్టేషన్ ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చారు. ఈ వ్యవహారం వెనుక జగన్ పీఏ కేఎన్‌ఆర్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు అప్పట్లో పెద్దఎత్తున వచ్చాయి. కేఎన్‌ఆర్ బినామీగా సత్యనారాయణను పెట్టగా, పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతలను రామకృష్ణారెడ్డి అనే వైద్యుడు, అతడి అనుచరులతో నేటికీ నిర్వహిస్తున్నట్టు సమాచారం. ప్రతినెలా కమీషన్లు వెళ్లిపోతున్నట్టు తెలిసింది. ప్రభుత్వం మారి రెండేళ్లు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోలేదు.
టీటీడీ బోర్డులోనూ చర్చ
పెట్రోల్ బంక్‌కు తక్కువ ధరకు స్థలాన్ని లీజుకు ఇవ్వడంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి గతంలో స్పందించారు. అప్పటి అధికార పార్టీ నాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు అతి తక్కువ ధరకే హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్‌కు 15 ఏళ్లపాటు స్థలాన్ని లీజుకు ఇచ్చారని అన్నారు. బంక్ కేటాయింపులో భారీ అవినీతి జరిగిందని, నెలకు దాదాపు రూ.25 లక్షలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గతేడాది విజిలెన్స్ వింగ్ అధికారులు విచారణ చేపట్టినప్పటికీ ఇప్పటికీ గోప్యంగా ఉంచారు.