ఘనంగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవాలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:49 AM
పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవాలు సోమవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిశాయి. శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై...
తిరుమల, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవాలు సోమవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిశాయి. శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీలపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యావనంలోని పరిణయోత్సవ వేదికకు చేరుకున్నారు. అక్కడ ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్రధారణ తదితర వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. తర్వాత ఆస్థానాన్ని శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధర్వణ వేదాలను పారాయణం చేశారు. ఈసందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి బుల్లెమ్మ ఆలపించిన కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామి, అమ్మవార్లు తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుకోవడంతో పద్మావతి పరిణయోత్సవాలు ముగిశాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, బోర్డు సభ్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.