తిరుమల.. వేదమార్గం!
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:05 AM
తిరుమల శ్రీవారి ఆలయానికి నలుదిక్కులా ఉన్న మాడవీధులు వేదమయం కానున్నాయి. ఈ నాలుగు వీధులకు నాలుగు వేదాల పేర్లు పెట్టాలని టీటీడీ యోచిస్తోంది.
4 మాడవీధులకు 4 వేదాల పేర్లు
ఖరారు చేసిన కమిటీ.. త్వరలో తీర్మానం
తిరుమల, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయానికి నలుదిక్కులా ఉన్న మాడవీధులు వేదమయం కానున్నాయి. ఈ నాలుగు వీధులకు నాలుగు వేదాల పేర్లు పెట్టాలని టీటీడీ యోచిస్తోంది. ఇప్పటికే అతిథిగృహాల పేర్లను మార్చిన పాలక మండలి.. తాజాగా తిరుమలలో ముఖ్యమైన మార్గాలు, రహదారులకు కూడా ఆధ్యాత్మికతను చేకూర్చేలా పేర్లు పెట్టాలని నిర్ణయించింది. వివిధ దేవతామూర్తుల పేర్లతో పాటు ఆళ్వార్లు, ఆలయ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన చక్రవర్తులు, పురాణ గ్రంథాల్లో విశిష్టత కలిగిన వారి పేర్లు పెట్టాలని భావించింది. ఈ క్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్, అన్నమాచార్య ప్రాజెక్ట్ అధికారి, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారితో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దాదాపు 45 పేర్లను ఎంపిక చేసింది. ప్రధానంగా ఆలయం చుట్టూ ఉన్న మాడవీధులను ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద మార్గాలుగా పిలవాలని ఖరారు చేసింది. అలాగే శ్రీవారిని దర్శించుకుని భక్తులు రోడ్డుపైకి వచ్చే ప్రధానమార్గమైన రాంభగీచ రోడ్డుకు శ్రీకృష్ణదేవరాయ మార్గంగా నూతన పేరు నిర్ణయించారు. ఇలానే మరికొన్ని మార్గాలకు అన్నమాచార్య, గరుడాద్రి, పద్మావతి తదితర పేర్లను ఎంపిక చేశారు. రింగురోడ్లతో సహా అన్నింటికీ ఆధ్యాత్మికత ఉట్టిపడే పేర్లతో నివేదికను సిద్ధం చేశారు. తదుపరి జరగనున్న పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.