తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో... ఏడుగురిపై క్రమశిక్షణ చర్యలు
ABN , Publish Date - May 27 , 2026 | 05:18 AM
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శ్రీవైష్ణవీ డెయిరీతో కుమ్మక్కైన ఏడుగురు కార్మిక శాఖ అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.
అమరావతి, తిరుపతి టీటీడీ, మే 26(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శ్రీవైష్ణవీ డెయిరీతో కుమ్మక్కైన ఏడుగురు కార్మిక శాఖ అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. సిట్ నివేదిక, ఆధారాలను అనుసరించి కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ శాఖ నిబంధనలు, ఏపీ పౌరసేవల ప్రవర్తనా నియమాలు-1964, ఏపీసీఎస్ రూల్స్ 1991 అనుసరించి అభియోగాలు నమోదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అధికారులు తమపై వచ్చిన ఆరోపణలపై పది రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శేషగిరిబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి సరఫరాలో అక్రమాలకు పాల్పడిన శ్రీవైష్ణవీ డెయిరీకి టీటీడీ అధికారులతోపాటు ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులు సహకరించినట్టు వెల్లడయ్యింది. తనిఖీల సమయంలో లోపాలను గుర్తించకుండా ఈ అధికారులు డెయిరీకి సహకరించినట్లు తేలింది. పైగా డెయిరీ లైసెన్స్ రెన్యువల్ సమయంలో తనిఖీలు చేయకుండా కొనసాగింపు ఇచ్చే విషయంలో పూర్తిగా సహకరించారు. ఇందుకు డెయిరీ నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో డెయిరీకి సహకరించిన ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ్‌సగా పని చేసి రిటైర్ అయిన కర్రి పరమేశ్వరరావు, విజయవాడ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సత్యనారాయణ, ప్రస్తుతం ఏలూరులో బాయిలర్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఎంవీఎల్ నరసింహరాజు, నెల్లూరులో బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న టి.సుష్మా, తిరుపతిలో బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న పి.రాంబాబు, చిత్తూరు, నెల్లూరులో బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఎన్.శివశంకరరెడ్డి, నెల్లూరులోని డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయంలో సూపర్‌వైజర్‌గా పనిచేసి రిటైర్ అయిన బి.రమేశ్‌బాబుపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. ఈ అభియోగాలకు సంబంధించి పది రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉద్యోగులపై ఉమ్మడి విచారణ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.