దేవుడు వదిలిపెట్టడు
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:21 AM
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీబీఐ సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొన్నా, వైసీపీ నేతలు అడ్డంగా వాదిస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు.
లడ్డూ కల్తీపై లఘు చర్చలో మంత్రి లోకేశ్
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీబీఐ సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొన్నా, వైసీపీ నేతలు అడ్డంగా వాదిస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘‘దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడం’’టూ హెచ్చరించారు. బుధవారం శాసనమండలిలో ఈ అంశంపై లఘు చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. వైసీపీ హయాంలో లడ్డూలో కల్తీ జరగలేదంటూ, హెరిటేజ్ డెయిరీపై ఆ పార్టీ సభ్యుడు తూమాటి మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ.. ‘‘దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం ఉంది. గత పదేళ్లుగా మా అబ్బాయి దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నాం. అలాంటి మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలతో సభకు రావాలి. టెండర్ ఎల్-3కు రాదు. ఎల్-1కు వస్తుంది. ఈమాత్రం కనీస అవగాహన ఉండాలి. సీబీఐ ఇచ్చిన రిపోర్ట్‌లో కల్తీ జరిగిందని స్పష్టంగా ఉంది. ఇప్పుడు నెయ్యి మార్కెట్ ధర పెరిగింది. కల్తీ చేసి, రూ.300కు నెయ్యి సరఫరా చేయమంటారా? మార్కెట్ ధర ఎంతుందో ఈరోజు గూగుల్‌లో చెక్ చేసుకోవచ్చు. కావాలని ఆరోపణలు చేస్తున్నారు. మాకు హక్కు ఉన్నా తిరుమలలో ఏనాడూ ముఖద్వారం నుంచి వెళ్లలేదు. క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్లాం. జగన్ తిరుమల కొండపై కనీసం డిక్లరేషన్‌పై సంతకం పెట్టలేదు. మీరా మాట్లాడేది?’’ అంటూ వైసీపీ సభ్యులపై లోకేశ్ మండిపడ్డారు.
మూడు నెలల్లో వర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ: మంత్రి లోకేశ్
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వచ్చే మూడు నెలల్లో భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల ఖాళీలపై మండలిలో టీచర్ ఎమ్మెల్సీ గోపీమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ‘వర్సిటీల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వర్సిటీ పోస్టుల విషయంలో ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న కేసుల్ని, న్యాయ సమస్యల్ని పరిష్కరించి, అవసరమున్న ఖాళీలను మూడు నెలల్లో భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటాం.’ అన్నారు.