కల్తీ నెయ్యి కేసు చార్జిషీట్లు విచారణకు స్వీకరణ
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:28 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన కేసులో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దాఖలు చేసిన రెండు చార్జిషీట్లను నెల్లూరు ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
రెండు అభియోగ పత్రాల్లో 36 మంది నిందితులు
తొలి చార్జిషీటులోని 14 మందికి నెల్లూరు ఏసీబీ కోర్టు పిలుపు
త్వరలో హాజరుకానున్న వివిధ డెయిరీల డైరెక్టర్లు, టీటీడీ అధికారులు
నెల్లూరు, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన కేసులో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దాఖలు చేసిన రెండు చార్జిషీట్లను నెల్లూరు ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించింది. కేసు విచారణకు సమాయత్తమైంది, తొలి చార్జిషీటులో 15 మంది, రెండోదాంట్లో 21 మంది.. మొత్తం 36 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జగన్ హయాంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్రమ ధనార్జన కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా జరిగిన ఈ కుట్రలో పలువురు వైసీపీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి రావడంతో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. దీనిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు సీబీఐ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నెయ్యి కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు, కొన్ని ప్రైవేటు డెయిరీలు, కొంతమంది టీటీడీ ఉద్యోగులు, వైసీపీ నాయకులు అధిక లాభాలకు ఆశపడి, కుట్రపూరితంగా కల్తీ నెయ్యి సరఫరా చేశారని సిట్ తేల్చింది. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చుతూ రెండు దఫాలుగా రెండు చార్జిషీట్లు దాఖలుచేసింది. గత ఏడాది సెప్టెంబరులో నెల్లూరు ఏసీబీ కోర్టులో రెండో అభియోగపత్రం వేసింది. అత్యంత సున్నితమైన కేసు కావడంతో చార్జిషీట్లను నిశితంగా పరిశీలించడానికి కోర్టు దాదాపు 9 నెలల సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఈ నెల 8వ తేదీన వాటిని పరిగణనలోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు.. తొలి విడతగా చార్జిషీటులోని మొదటి 14 మందిని న్యాయస్థానం విచారణకు పిలువనుంది. ఆ తర్వాత రెండో చార్జిషీటులోని నిందితులను కోర్టు విచారిస్తుంది.