Share News

కంపు కొడుతోందని నాడే చెప్పాం!

ABN , Publish Date - Feb 08 , 2026 | 05:18 AM

వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

కంపు కొడుతోందని నాడే చెప్పాం!

  • శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో నెయ్యి సువాసన కూడా రాలేదు

  • ఒక్కపూట నిల్వ ఉంటేనే కంపు కొట్టింది

  • కౌంటర్లలోనే పిండి పిండి అయిపోయింది

  • తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై నెటిజన్ల చర్చ

  • పాత పోస్టులు మళ్లీ వైరల్‌ చేస్తున్న భక్తులు

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. లడ్డూ నాణ్యతపై 2020-23 మధ్యకాలంలో తాము ఎన్నో ఫిర్యాదులు.. పోస్టులు చేశామని పలువురు నెటిజన్లు అప్పట్లో చేసిన పోస్టులను మళ్లీ వైరల్‌ చేస్తున్నారు. తాజాగా సిట్‌ నివేదికలో లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టం చేయడంతో, సిట్‌ నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ తమ పాత పోస్టులను నెటిజన్లు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. నాణ్యత లేని నెయ్యితో లడ్డూల తయారీపై నాడు ప్రజలు, భక్తులు ఫిర్యాదులు చేసిన పోస్టులు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. దర్యాప్తు జరగకముందే లడ్డూలో నెయ్యి నాణ్యతపై తాము టీటీడీ పాలకమండలికి అనేక రూపాల్లో ఫిర్యాదులు చేశామని, సామాజిక మాధ్యమాల్లోనూ ఆ ఫిర్యాదులను పోస్టు చేశామని పలువురు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కంపు కొడుతోందని ఆనాడే ఫిర్యాదు చేశామని, ఒక్కపూట నిల్వ ఉంటేనే వాసన వస్తోందని చెప్పామని తెలిపారు.

Untitled-9 copy.jpg


  • ఒక్కొక్కరిది ఒక్కొక్క గోడు!

  • ‘లడ్డూ నాణ్యంగా లేదు. పొడి అయిపోతోంది. నెయ్యి సువాసన, నాణ్యత అస్సలు లేదు. అన్నప్రసాదం బాగోలేదు’ - 2022, మార్చి 24న ఓ భక్తుడి ఆవేదన.

  • ‘లడ్డూ ప్రసాదం కొద్దిగా రుచి చూసినా వళ్లంతా దద్దుర్లు వస్తున్నాయి. నెయ్యి ఫక్తు కల్తీగా ఉంది. మహాప్రభో సరి చేయండి’ - 2022, మే 29న మరో భక్తుడి గోడు.

  • ‘తిరుపతి లడ్డూను ముక్కు దగ్గర పెట్టుకున్నా వాసన రావడం లేదు. లడ్డూలకు వెళ్లాల్సిన నెయ్యిని కూడా నాకేస్తున్నారా?’ - 2021, మార్చి 13న వెంకన్న భక్తుడి ఆగ్రహం.

  • ‘ప్రసాదంలో నెయ్యి మాయం. ఏడుకొండలపై వెంకటేశుని నామం మారుమోగడం లేదు’- 2023, మే21న ఓ భక్తుని వేదన.

  • ‘గడిచిన మూడేళ్ల నుంచి లడ్డూ క్వాలిటీ బాగోవడం లేదు. కౌంటర్లో ఇచ్చినప్పుడే పొడి అయిపోతోంది’ - ఓ భక్తుడి ఆందోళన.

  • లడ్డూలో నెయ్యి వాసనే లేదని నాటి టీడీడీ చైర్మన్లు.. సుబ్బారెడ్డి, భూమనలకే నేరుగా ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని, ఎన్ని ఫిర్యాదులు చేసినా టీటీడీ పాలకమండలి పట్టించుకున్నదే లేదని మరికొందరు భక్తులు వాపోయారు.

  • ఉద్దేశపూర్వకంగా నెయ్యి కల్తీ జరిగిందని నెటిజన్లు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • 2022లోనే సీఎ్‌ఫటీఆర్‌ఐ ల్యాబ్‌ నివేదికలో కల్తీ నెయ్యి గురించి నాటి టీటీడీ పెద్దలకు సమాచారం ఉందని, సిట్‌ చార్జిషీట్‌లో కూడా పేర్కొన్నారని, ఉద్దేశపూర్వకంగానే తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేందుకు కల్తీకి పాల్పడ్డారని మరికొందరు భక్తులు పోస్టులు పెడుతున్నారు.

  • కోట్ల మంది భక్తుల అభిప్రాయాలను, ఫిర్యాదులను పట్టించుకోకుండా నాటి పాలకమండలి, అధికారులు మహాపాపం చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు.

Updated Date - Feb 08 , 2026 | 05:21 AM