Share News

అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే కుట్ర

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:26 AM

రాష్ట్రంలో అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే కుట్రలో భాగంగానే తిరుమల లడ్డూని కల్తీ నెయ్యితో తయారు చేయడమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే కుట్ర

  • అందులో భాగమే తిరుమల లడ్డూ కల్తీ

  • వైసీపీది కల్తీ మనస్తత్వం.. కల్తీ పాలన

  • దేవాలయ వ్యవస్థ అంటే వారికి లెక్కలేదు

  • మహాపచారం చేసి క్లీన్‌ చిట్‌ ఇచ్చుకోవడం వారికే చెల్లు: బీజేపీ నేత మాధవ్‌

రాష్ట్రంలో అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే కుట్రలో భాగంగానే తిరుమల లడ్డూని కల్తీ నెయ్యితో తయారు చేయడమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీది కల్తీ మనస్తత్వమని, వారి పాలన అంతా కల్తీ అన్నారు. హిందూ దేవాలయ వ్యవస్థ అంటే వైసీపీ వారికి లెక్క లేదని, దాని పర్యవసానమే వారి హయాంలో ఆలయాలపై జరిగిన దాడులు, తిరుమలలో లడ్డూ కల్తీ అని పేర్కొన్నారు. తప్పు చేసి తమకు తామే క్లీన్‌ చిట్‌ ఇచ్చుకోవడం వైసీపీ వారికే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. ‘తప్పు చేసి క్షమాపణ చెప్పాల్సిన వారే నిస్సిగ్గుగా మమ్మల్ని క్షమాపణ చెప్పాలంటున్నారు. మేమెందుకు క్షమాపణ చెప్పాలి..? మీ కల్తీ బాగోతాన్ని బయట పెట్టినందుకా.. మీలా తిరుమలలో అన్యమతస్థులను చైర్మన్లుగా, ఉద్యోగులుగా నియమించనందుకా..? తిరుమలతోపాటు అన్ని ఆలయాల పవిత్రతను కాపాడుతున్నందుకా..? దేనికి క్షమాపణ చెప్పాలి? బీజేపీ కేవలం హిందూమతానికే ప్రతినిధి కాదు. భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. మతాలకతీతంగా ప్రజల మతవిశ్వాసాలను కాపాడేందుకు కూటమి తరఫున కలిసికట్టుగా పోరాడతాం’ అని స్పష్టంచేశారు.

కల్తీ.. తెలిసి చేసిన నేరం: పయ్యావుల కేశవ్‌

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం గత పాలకులకు తెలిసి జరిగిన నేరమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ జరుగుతోందని 2022లో సీఎ్‌ఫటీఆర్‌ఐ స్పష్టంగా ఇచ్చిన నివేదికను నాటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తొక్కిపెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024లో ఎన్‌డీడీబీ కూడా తిరుమల నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టంగా పేర్కొందన్నారు. ఆ నివేదికలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందని స్పష్టంగా చెప్పారని.. దాని ఆధారంగానే సీఎం మాట్లాడారని తెలిపారు. ‘తప్పు జరిగిందని తెలిసీ ప్రజలకు చెప్పకపోతే అది కూడా నేరమే. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పక్కా పథకం ప్రకారం నెయ్యి కల్తీకి తెరదీసింది. ముందుగా నిబంధనలు సడలించారు. తర్వాత తమకు అనుకూలమైన సంస్థలతో బేరాలు మాట్లాడుకుని అర్హత లేకున్నా.. ఫేక్‌ డాక్యుమెంట్లు పెట్టినా పట్టించుకోకుండా వారికే నెయ్యి సరఫరా బాధ్యత అప్పగించారు. కల్తీ లడ్డు వ్యవహారంలో దోషులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎన్డీఆర్‌ఐలో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరే తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి నాణ్యతను పరీక్షించే కమిటీలో కూడా ఉన్నారు. ఆ కారణంగానే సీబీఐ ఎన్డీఆర్‌ఐకు నెయ్యి శాంపిల్స్‌ను పంపితే అరకొరగా నివేదిక ఇచ్చింది. అయితే తామిచ్చిన రిపోర్టు అంతిమం కాదని.. తమకు జంతుకొవ్వును నిర్ధారించే సామర్థ్యం లేదని కూడా పేర్కొంది. అయినా ఆ నివేదికనే తీసుకుని వైసీపీ వారు తమకు క్లీన్‌ చిట్‌ వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. జంతు కొవ్వు కలవలేదని సీబీఐ తన నివేదికలో ఎక్కడా పేర్కొనలేదు’ అని తేల్చిచెప్పారు.

Updated Date - Feb 06 , 2026 | 03:26 AM