Share News

తప్పులన్నీ బాబువే

ABN , Publish Date - Feb 20 , 2026 | 04:24 AM

తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు తప్పు చేసినట్లుగా నాలుగు వేళ్లు చూపిస్తుంటే.. ఒక్క వేలిని తనవైపు చూపిస్తే ఎలా అని జగన్‌ ప్రశ్నించారు. అందుకే దేవుడు చంద్రబాబుకు...

తప్పులన్నీ బాబువే

  • ‘కల్తీ’తో వైసీపీకి సంబంధం లేదు

  • చంద్రబాబువైపు 4 వేళ్లు చూపిస్తుంటే.. ఒక్కవేలిని నా వైపు చూపిస్తే ఎలా?

  • సానుకూల మీడియాతో జగన్‌ 3 గంటలా 45 నిమిషాల ప్రసంగం

  • బడ్జెట్‌పై మాట్లాడతారని తొలుత మీడియాకు సమాచారం

  • కానీ హెరిటేజ్‌పై తీవ్ర ఆరోపణలు

  • ‘కల్తీ’పై సిట్‌ నివేదిక మీద కప్పదాటు

  • మరోసారి జగన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు తప్పు చేసినట్లుగా నాలుగు వేళ్లు చూపిస్తుంటే.. ఒక్క వేలిని తనవైపు చూపిస్తే ఎలా అని జగన్‌ ప్రశ్నించారు. అందుకే దేవుడు చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తున్నాడని వ్యాఖ్యానించారు. గురువారం తాడేపల్లి ప్యాలెస్‌లో ఎంపిక చేసుకున్న సానుకూల మీడియాతో జగన్‌ దాదాపు 3 గంటలా 45 నిమిషాలు మాట్లాడారు. బడ్జెట్‌పై మాట్లాడతారంటూ సమాచారం ఇచ్చినప్పటికీ.. కావాలనే ప్రశ్న వేయించుకుని నెయ్యి వ్యవహారంపై మాట్లాడారు. ‘మీరడిగారు కాబట్టే’.. అంటూ కూసింత నాటకీయతను ప్రదర్శిస్తూ, ముందుగా సిద్ధం చేసిన సమాచారాన్ని తెప్పించుకుని వల్లె వేశారు. తిరుమల లడ్డూ అంశంలో తప్పంతా చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు హయాంలోనైనా, వైసీపీ హయాంలోనైనా టెండర్ల ద్వారా పాడి నెయ్యి సరఫరా చేశారని చెప్పారు. నెయ్యిని సరఫరా చేసేవారు అక్రిడియేటెడ్‌ ల్యాబ్‌లో సర్టిఫై చేసుకుని వచ్చాకే లోపలికి అనుమతి ఇస్తారని చెప్పారు. సీబీఐ సిట్‌ చార్జిషీట్‌లోని పేజీ నంబర్‌ 44, 91, 64 ప్రకారం.. ఎంఎ్‌సఏఆర్‌ వైష్ణవి డెయిరీకి చెందిన 4 ట్యాంకర్లను రిజెక్టు చేయగా, శ్రీకాళహస్తి రాఘవేంద్ర క్రషర్స్‌ వద్ద రహస్యంగా ఉంచి 2024 ఆగస్టు, సెప్టెంబరులో మళ్లీ సరఫరా చేశారని అన్నారు. ఒకసారి రిజెక్టు చేసిన నాలుగు ట్యాంకర్లను 2024 సెప్టెంబరు 18న తిరుమలకు మరోసారి వస్తే టీటీడీ అధికారులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు.


సరిగ్గా అదే రోజున చంద్రబాబు లడ్డూలో పశువుల కొవ్వు ఉందని ఆరోపణ చేయడం ఏమిటన్నారు. ఇవన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని, వైసీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. నెయ్యి సరఫరాలో తప్పులన్నీ టీడీపీ హయాంలో జరిగితే 2019 నుంచి అని ఎందుకంటున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. నెయ్యి వ్యవహారంపై 2014 నుంచి ఎందుకు విచారణ చేయడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో 15 సార్లు, వైసీపీ హయాంలో 18 సార్లు నెయ్యి శాంపిల్స్‌లో ఫెయిల్‌ అయితే వెనక్కు పంపేశారన్నారు. ప్రీమియర్‌ అగ్రి ఫుడ్‌ 2013-14 సమయంలో వరుసగా నెయ్యి సప్లయ్‌ చేసిందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ అంతా మోసమేనన్నారు. మోసానికి షర్టూ, ఫ్యాంటూ వేస్తే చంద్రబాబు అవుతాడని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లను అమలు చేయడం లేదన్నారు.


ప్రజాధనం దుర్వినియోగం

ప్రజాధనం దుర్వినియోగం చేసేలా సీఎం చంద్రబాబుకు ఒక ప్రత్యేక విమానం, ఒక హెలికాప్టర్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు మరో ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌, మంత్రి లోకేశ్‌కు ఒక విమానం, హెలికాప్టర్‌ ఎందుకని జగన్‌ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు క్రికెట్‌ అంటే ఇష్టమున్నా మ్యాచ్‌లను చూసేందుకు ప్రత్యేకంగా శ్రీలంకకు వెళతారా అని ప్రశ్నించారు. క్రికెట్‌ అంటే ఇష్టముంటే ఇంట్లో చూసుకోవాలని, తానూ ఇంట్లోనే క్రికెట్‌ చూశానని అన్నారు. రాత్రి ప్రత్యేక విమానంలో శ్రీలంకకు వెళ్లి, ఉదయానికి విశాఖకు వస్తారా అని ప్రశ్నించారు.

‘కల్తీ’ ఊసెత్తకుండా జగన్‌ జాగ్రత్త

నాడు తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరాలో కల్తీ జరిగిందని, అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో తయారు చేశారని సీబీఐ సిట్‌ తేల్చింది. కానీ జగన్‌ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా మరోసారి డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో గందరగోళం సృష్టించేలా గంటల తరబడి మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో సహా ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్యనేతలు అంగీకరించారు. కానీ ఉద్దేశపూర్వకంగా జగన్‌ ఈ అంశాన్ని దాట వేశారు. హెరిటేజ్‌ గురించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందాపూర్‌ డెయిరీ అంశంపై దాదాపు గంట సేపు మాట్లాడారు. ఏదో జరిగినట్టు ప్రజల్లో సందేహాలు కలిగేలా ఇతర అంశాల గురించి మాట్లాడారు. 2014 నుంచి నెయ్యి సరఫరాపై దర్యాప్తు చేయాలంటూ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. జగన్‌ హయాంలో తిరుమలకు నెయ్యి సరఫరాలో కుట్ర చేశారని, రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యి సరఫరా చేశారని సిట్‌ నివేదికలో పేర్కొంది. కానీ జగన్‌ ఈ విషయం గురించి మాట్లాడకుండా చంద్రబాబుకు తప్పులు ఆపాదించేలా మాట్లాడారు.

Updated Date - Feb 20 , 2026 | 04:25 AM