Share News

తిరుమలలో వంటశాల ఆధునికీకరణకు అడుగులు..!

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:52 AM

దశాబ్దానికిపైగా వినియోగిస్తున్న వంట పాత్రల స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా టీటీడీ సిద్ధమవుతోంది.

తిరుమలలో వంటశాల ఆధునికీకరణకు అడుగులు..!

  • రీడిజైన్‌కు టీవీఎస్ఎం సహకారం

  • కొండకు చేరుకున్న 22 కొత్త పాత్రలు

  • త్వరలో నూతన పాత్రలతో ట్రయల్‌ రన్‌

తిరుపతి (టీటీడీ)/తిరుమల, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): దశాబ్దానికిపైగా వినియోగిస్తున్న వంట పాత్రల స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా టీటీడీ సిద్ధమవుతోంది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని ఆధునికీకరించాలని టీటీడీ గతేడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా పదిహేనేళ్లుగా వినియోగిస్తున్న పాత్రల(వెజెల్స్‌)తోపాటు బాయిలర్లను మార్చడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే డొనేషన్‌ ప్రాతిపదికన పాత్రలను తీసుకొచ్చారు. త్వరలోనే అన్నదాన సత్రం పక్కన షెడ్లు వేసి ట్రయల్‌ నిర్వహించనున్నారు. అంతా బాగానే ఉందని నిర్ధారించుకున్న తర్వాత పాతవాటి స్థానంలో వీటిని అమర్చేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

2011 నుంచి వినియోగం

వెంగమాంబ అన్నదాన సత్రాన్ని 2011లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రోజుకు 50 వేల మందికి అన్నప్రసాదాలు అందించేందుకు కిచెన్‌లో 22 వంట పాత్రలు ఏర్పాటు చేశారు. వీటిని స్టీమ్‌ బాయిలర్లతో అనుసంధానం చేసి అన్నప్రసాదం తయారు చేస్తున్నారు. వీటికి అదనంగా 2016లో గోధుమ రవ్వ ఉప్మా, రవ్వ ఉప్మా, పొంగల్‌, చట్నీ, సాంబారును ఉదయం అల్పాహారం కింద ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రోజుకు 75వేల మంది అన్నదాన సత్రానికి వస్తుండగా పర్వదినాలు, సెలవు రోజుల్లో వీరి సంఖ్య 1.50 లక్షలకు చేరుకుంటోంది. దీనివల్ల వంట పాత్రలు, బాయిలర్లను ఎక్కువ గంటలు ఉపయోగించాల్సి వస్తోంది. ప్రతి రోజూ 18 గంటలకుపైగా ఇవి పనిచేస్తున్నాయి. 2011 నుంచి వినియోగం వల్ల ఇవి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్‌ అధికారులు వీటికి మరమ్మతులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని మార్చాలని టీటీడీ నిర్ణయించింది.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో..

తిరుమల పర్యటన సమయంలో వెంగమాంబ అన్నదాన సత్రాన్ని ఆటోమేషన్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో 2024 అక్టోబరులో టీవీఎస్‌ మెటార్స్‌ (టీవీఎస్ఎం) కంపెనీ లిమిటెడ్‌ పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంటీవీఏసీని ఆధునీకరించేందుకు ముందుకొచ్చింది. ఇందుకు కిచెన్‌ను అత్యున్నత స్థాయిలో పూర్తిగా రీడిజైన్‌ చేసేందుకు టీవీఎస్ఎం అంగీకారం తెలిపింది. కొత్త పాత్రలను డొనేషన్‌ ప్రాతిపదికన సేకరించేందుకు నిర్ణయించింది. దీంతో టీటీడీ అధికారులు మొత్తం 22 వంట పాత్రలను ఒక్కొక్కటి రూ.8 లక్షల చొప్పున డొనేషన్‌పై సేకరించారు. ఇప్పటికే వీటిని తిరుమలకు తీసుకొచ్చారు. మరోవైపు ప్రస్తుతం 9 బాయిలర్లు గంటకు 600 కిలోల ఆహార ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వీటి స్థానంలో గంటకు 3 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే రెండు బాయిలర్లను మార్చనున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 03:52 AM