TTD Revenue: 2025లో హుండీ ఆదాయం రూ.1,383.90 కోట్లు
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:57 AM
2025లో తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,383 కోట్ల ఆదాయం లభించింది. 2024తో పోలిస్తే రూ.18 కోట్లు అదనంగా సమకూరింది.
2.61 కోట్ల మంది భక్తులకు శ్రీవారి దర్శనం
13.52 కోట్ల లడ్డూల విక్రయాలు
తిరుమల, జనవరి 1(ఆంధ్రజ్యోతి): 2025లో తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,383 కోట్ల ఆదాయం లభించింది. 2024తో పోలిస్తే రూ.18 కోట్లు అదనంగా సమకూరింది. అలాగే 2025లో 2.61 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2024లో ఈ సంఖ్య 2.55 కోట్లు. ఇక 2024లో 12.15 కోట్ల లడ్డూ విక్రయాలు కాగా, 2025లో 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి. దాదాపు 1.37 కోట్ల లడ్డూలను అదనంగా విక్రయించారు. డిసెంబరు 27వ తేదీన రికార్డు స్థాయిలో 5.13 లక్షల లడ్డూలను భక్తులకు అందించారు. గత పదేళ్లలో ఇదే అత్యధికం. నాణ్యమైన నెయ్యి, ముడిసరుకుల కొనుగోలుతో ఇటీవల కాలంలో లడ్డూల నాణ్యత, రుచిపై భక్తుల నుంచి విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే.