వెంకన్న దర్శనానికి 24 గంటలు
ABN , Publish Date - May 24 , 2026 | 04:47 AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కూడా భక్తులతో వైకుంఠంలోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.
తిరుమల, మే 23(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కూడా భక్తులతో వైకుంఠంలోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్ బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లు నిండిన వెంటనే టీటీడీ ప్రవేశమార్గాన్ని మూసివేసి క్యూలైన్ ఖాళీ కాగానే అనుమతిస్తోంది. ఇక, స్లాటెడ్ సర్వదర్శన భక్తులకు కూడా దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. రద్దీ కొనసాగుతున్న క్రమంలో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, లగేజీ, రిసెప్షన్ కౌంటర్లు, అన్నప్రసాద భవనం, నడకమార్గాలు, ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి.
22 రోజుల్లో 17.48 లక్షల మందికి శ్రీవారి దర్శనం
వేసవి సెలవుల నేపథ్యంలో గడిచిన 22 రోజుల్లో 17,48,262 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ ప్రకటించింది. అత్యధికంగా 16వ తేదీన 91,020 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే మూడురోజులు 90 వేల సంఖ్య దాటగా, ఎనిమిదిసార్లు 80 వేల సంఖ్య దాటింది. ఈ నెల 1 నుంచి 22వ తేదీ వరకు సగటున 79 వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 7.91 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.82.96 కోట్లు లభించింది. మరోవైపు టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శుక్రవారం 87,689 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలోనూ 5,850 మంది సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించిన క్రమంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మందికి దర్శనం చేయించగలిగారు.