Share News

నిత్య హారతులకూ నియమం!

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:23 AM

‘‘శ్రీవారి నిత్య హారతుల సమర్పణలో కర్ణాటక ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తాం’’... అంటూ ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

నిత్య హారతులకూ నియమం!

  • తిరుమలపై కర్ణాటక సీఎం వ్యాఖ్యలతో చర్చ

  • నిత్యం మఠాలు, మైసూరు సంస్థానం తరఫున హారతులు

  • పాల్గొనే వారి జాబితా ముందే ఖరారు, ఆదేశాలు

  • ఆ ముగ్గురిలో ఒక్కరికే హారతిలో అవకాశం

  • డీకే చెప్పినట్లుగా ఎమ్మెల్యేలు, మంత్రులకు నో చాన్స్‌

(తిరుమల-ఆంధ్రజ్యోతి)

‘‘శ్రీవారి నిత్య హారతుల సమర్పణలో కర్ణాటక ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తాం’’... అంటూ ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘‘ఔనా... ఒక రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు తిరుమలలో ఇలాంటి వెసులుబాటు ఉంటుందా? అందులోనూ కర్ణాటక వాళ్లకు విశేషాధికారులు ఉన్నాయా’’ అనే చర్చ మొదలైంది. వాస్తవం ఏమిటంటే... కర్ణాటకే కాదు, ఏ రాష్ట్ర నేతలకూ ఇలా శ్రీవారి నిత్య హారతుల్లో పాల్గొనే అవకాశం, అధికారం లేదు. తిరుమల ప్రత్యేక సంప్రదాయం ప్రకారం... శ్రీవారికి రోజూ తొలి గంట సమయంలో నిర్వహించే నైవేద్య సమయంలో నిత్య హారతులు ఇస్తారు. 20 మఠాలతోపాటు మైసూరు సంస్థానం నుంచి... అంటే మొత్తంగా 21 నిత్య హారతులు ఇస్తారు. వాటి ప్రతినిధులు హారతి పళ్లెం తీసుకుని ఆలయంలోకి వెళితే... అర్చకులు స్వామికి హారతి సమర్పించి తిరిగి వారికే అందజేస్తారు. ఇందులో ఎవరు పడితే వారు పాల్గొనే అవకాశం ఉండదు. ‘మా మఠం/సంస్థ నుంచి వీరు నిత్య హారతిలో పాల్గొంటారు’ అని ఆయా మఠాల వారు ఏటా డిసెంబరులోనే ముగ్గురు ప్రతినిధులతో జాబితాను టీటీడీకి సమర్పిస్తారు. ఉదాహరణకు... మైసూరు సంస్థానం తరఫున తిరుమలలోని కర్ణాటక సత్రంలో ఉండే ఆ రాష్ట్ర ప్రతినిధి లేదా ప్రతినిధుల పేర్లు ఇందులో ఉంటాయి. ఈ జాబితాకు అనుగుణంగా టీటీడీ ఆదేశాలిస్తుంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒక్కరే నిత్య హారతుల్లో పాల్గొనాలి. కర్ణాటక సీఎం చెప్పినట్లుగా మంత్రులు, ప్రజాప్రతినిధులకు నిత్యహారతుల్లో పాల్గొనే అవకాశం ఉండదు.


కర్ణాటక ప్రత్యేకత ఇదే...

స్వాతంత్య్రం రాక ముందు తిరుమల క్షేత్ర అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ముఖ్యమైన పాలకుల్లో... మైసూరు మహారాజు ఒకరు. బ్రహ్మోత్సవాల్లో వినియోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలతో పాటు ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో పల్లకీని ప్రత్యేకంగా తయారు చేయించి శ్రీవారికి బహూకరించారు. మైసూరు మహారాజు జయంతి సందర్భంగా గత 300 ఏళ్లుగా టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. రోజూ తెల్లవారుజామున సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరఫున నవనీత హారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపాలకు నెయ్యి ఇచ్చే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ప్రతి నెలా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు నిర్వహించే ఆస్థానం, ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాల్లోనూ మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. అదేవిధంగా 21 నిత్యహారతుల్లో మైసూరు మహారాజు తరఫున కర్ణాటకకూ ప్రాతినిధ్యం లభిస్తోంది. అంతే తప్ప... ఇందులో ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు పాల్గొనే అవకాశం లేదు.

డీకే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: భానుప్రకాశ్‌రెడ్డి

‘తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం! మైసూరు మహారాజుకు గౌరవంగా ఇచ్చిన సంప్రదాయం ఇది. రాజకీయ నాయకుల కోసం ఇచ్చినది కాదని శివకుమార్‌ గుర్తుంచుకోవాలి. ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి’’ అని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 04:24 AM