దైవానుగ్రహం కోసమే హనుమ విగ్రహం చోరీ
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:23 AM
తిరుమల నడకమార్గంలోని ఏడవ మైలులో హనుమ విగ్రహాన్ని దైవానుగ్రహం కోసం పూజించుకోవాలనే ఆలోచనతో విశాఖపట్టణం వాసి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు.
పూజ చేసుకునేందుకే ఎత్తుకెళ్లానన్న జశ్వంత్‌కుమార్
తిరుమల విగ్రహం చోరీ కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు
తిరుపతి(నేర విభాగం), జూలై 23(ఆంధ్రజ్యోతి): తిరుమల నడకమార్గంలోని ఏడవ మైలులో హనుమ విగ్రహాన్ని దైవానుగ్రహం కోసం పూజించుకోవాలనే ఆలోచనతో విశాఖపట్టణం వాసి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ రవిమనోహర చారి కేసు వివరాలను గురువారం సాయంత్రం వెల్లడించారు. విశాఖపట్టణం జిల్లా భీమునిపట్నం మండలం టి.నగరపాలేనికి చెందిన పొట్నూరు జశ్వంత్‌కుమార్(28) ఇంజనీరింగ్ చదివి కొన్నాళ్లు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేశాడు. ఆ తరువాత ఉద్యోగం పోవడంతో మూడు సంవత్సరాలుగా ఖాళీగానే ఉంటున్నాడు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. ఈ 5న మిత్రులతో కలిసి తిరుమలకు వచ్చినపుడు నడకదారిలో ఈ చిన్న ఆంజనేయస్వామి విగ్రహం జశ్వంత్ దృష్టిలో పడింది. మూడ్రోజుల క్రితం మళ్లీ ఒక్కడే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడు. తిరుమల నుంచి జీప్‌లో తిరిగి వెళ్తూ బుధవారం వేకువజామున విగ్రహాన్ని అపహరించాడు. బుధవారం రాత్రి హౌరా ఎక్స్‌ప్రెస్‌లో వెళుతున్న నిందితుడిని ఒంగోలు స్టేషన్‌లో జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకుని, హనుమ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని తిరుపతికి తరలించారు. కేసు నమోదు చేసిన తిరుమల టూ టౌన్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు ఏఎస్పీ వెల్లడించారు. కాగా, అలిపిరి కాలినడక మార్గంలోని ఏడవ మైలులో చోరీకి గురైన హనుమ విగ్రహాన్ని టీటీడీ అర్చక బృందం గురువారం శాస్ర్తోక్తంగా పునఃప్రతిష్ఠించింది.