Share News

తిరుమలలో స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:24 AM

శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాలను మరింత నాణ్యంగా, రుచిగా భక్తులకు అందించేందుకు తిరుమలలో ‘ఎఫ్‌ఎస్ఎస్ఏఐ’ వాటర్‌ అండ్‌ ఫుడ్‌ అనాలసిస్‌ ల్యాబోరేటరీ(స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌) సిద్ధమైంది.

తిరుమలలో స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌

  • 12వేల చ.అ. విస్తీర్ణంలో... 25 కోట్ల వ్యయంతో నిర్మాణం

  • కల్తీని పూర్తిస్థాయిలో అరికట్టేలా అత్యాధునిక పరికరాలు

  • శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత తనిఖీలు

  • సూక్ష్మస్థాయిలో కల్తీ జరిగినా గుర్తించేలా పరీక్షలు

  • నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

అమరావతి/తిరుమల, మార్చి 20(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాలను మరింత నాణ్యంగా, రుచిగా భక్తులకు అందించేందుకు తిరుమలలో ‘ఎఫ్‌ఎస్ఎస్ఏఐ’ వాటర్‌ అండ్‌ ఫుడ్‌ అనాలసిస్‌ ల్యాబోరేటరీ(స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌) సిద్ధమైంది. దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ల్యాబ్‌ను సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. కల్తీని పూర్తిస్థాయిలో అరికట్టేలా అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ ద్వారా ఇకపై భక్తులకు సురక్షితమైన ప్రసాదాలు అందనున్నాయి. 2024 అక్టోబరు 8న ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ)తో రాష్ట్ర అధికారులు చేసుకున్న ఒప్పందం మేరకు తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ ల్యాబ్‌ను నిర్మించారు. ప్రసాదాల్లో వినియోగించే ముడిసరుకులను వంద శాతం ఇక్కడ పరీక్షించనున్నారు. ఈ తరహా ఫుడ్‌ ల్యాబ్‌ ఒక పుణ్యక్షేత్రంలో ఏర్పాటు కావడం దేశంలో ఇదే తొలిసారి. ఇందులో కెమికల్‌, మైక్రో బయాలజీ విభాగాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్యాక్టీరియా గుర్తింపుతో పాటు క్లీన్‌ రూమ్‌, ఎయిర్‌ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌ వంటి అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు. యాంటీ బయోటిక్స్‌, పురుగు మందుల అవశేషాలు, లెడ్‌ ఆర్సెనిక్‌ వంటి భార లోహాల ఆనవాళ్లను ఇట్టే గుర్తించే యంత్రాలను కెమికల్‌ విభాగంలో సిద్ధం చేశారు. ఎనర్జిటిక్‌ పర్సంటేజ్‌ కోసం బాంబ్‌ కెలోరీమీటర్‌ కూడా ఏర్పాటైంది. అతి సూక్ష్మస్థాయిలో పరీక్షలు నిర్వహించేందుకు పార్ట్స్‌ పర్‌ ట్రిలియన్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.


ఈ ల్యాబ్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోని ఇతర ల్యాబ్‌లపై టీటీడీకి ఆధారపడే అవసరం ఉండదు. కాగా, తిరుమలలో తొలిసారిగా 1981లో వాటర్‌ అండ్‌ ఫుడ్‌ అనాలసిస్‌ ల్యాబ్‌ ఏర్పాటైంది. ఆ తర్వాత 1988లో కొన్ని నూతన యంత్రాలను సమకూర్చారు. 2018 నుంచి ఈ ల్యాబ్‌ ఎన్‌ఏబీఎల్‌ ప్రమాణాలతో 105 పెరామీటర్లపై అక్రెడిటేషన్‌ పొందడం విశేషం. గత ప్రభుత్వంలో నెయ్యితో పాటు వివిధ రకాల ముడిసరుకుల్లోనూ కల్తీని గుర్తించిన క్రమంలో సూక్ష్మస్థాయిలో కల్తీని పసిగట్టేలా అత్యాధునిక పరికరాలు, టెక్నాలజీతో కూడిన ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలనే సీఎం సూచనల మేరకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ల్యాబ్‌ను నిర్మించారు. కాగా, 2024లో నెయ్యి కల్తీని గుర్తించేందుకు జీసీ(గ్యాస్‌ క్రోమటోగ్రాఫీ), హెచ్‌పీఎల్‌సీ(హై ఫెర్ఫార్మన్స్‌ లిక్విడ్‌ క్రోమటోగ్రాఫీ) అనే రెండు యంత్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది జూన్‌ 1న ప్రారంభమైన ల్యాబ్‌ ఏర్పాటు పనుల ఇటీవలే పూర్తయ్యాయని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఇందులో సుమరు రూ.10 కోట్ల విలువైన అత్యాదునిక పరికరాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. త్వరలో ప్రాన్స్‌ నుంచి రూ.3 కోట్ల విలువైన ఈ-నోస్‌, ఈ-టంగ్‌ యంత్రాలు రాబోతున్నాయని, ఇవి వాసన, రుచిలో తేడాలను గుర్తిస్తాయని పేర్కొన్నారు. ఆహార పదార్థాల నుంచి సేకరించిన ఒక్కో నమూనాను పదుల సంఖ్యలో పరీక్షించే సామర్థ్యం ల్యాబ్‌కు ఉందని, గరిష్ఠంగా ఒక నమూనా ద్వారా 50 రకాల పరీక్షలు చేయడానికి వీలవుతుందని మంత్రి వివరించారు. జలప్రసాదం నమూనాలను కూడా ఈ ల్యాబ్‌లో పరీక్షిస్తారని మంత్రి తెలిపారు.


తిరుమలకు సీఎం చంద్రబాబు

నేడు దేవాన్ష్‌ పుట్టినరోజు.. అన్నప్రసాదాల వితరణ

శ్రీవారి దర్శనార్థం సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి అతిథిగృహం వద్ద టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి ఆయనకు స్వాగతం పలికారు. మనవడు దేవాన్ష్‌ ప్రతి పుట్టినరోజున తిరుమలలో ఒకరోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం అందజేయడంతో పాటు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు స్వయంగా వడ్డించడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే ఈ పథకానికి రూ.44 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించనున్నారు. తిరిగి అతిథిగృహానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శిస్తారు. టెక్నాలజీ ద్వారా క్యూలైన్ల నిర్వహణ, భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, త్వరితగతిన భక్తులకు దర్శనం చేయించే విధానాలను పరిశీలించి పలు సూచనలు చేయనున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్‌ తదితరులు సీఎంతో తిరుమల చేరుకున్నారు.


టీటీడీ చైర్మన్‌, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

తిరుమలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, చేపడుతున్న అభివృద్ధి పనులు, దర్శన విధానాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులతో సీఎం చంద్రబాబు సుమారు 40 నిమిషాల పాటు సమీక్షించారు. వసతికి సంబంఽధించి తిరుమల, తిరుపతిలో అనుసరిస్తున్న విధానాలను చర్చించడంతో పాటు రద్దీకి తగినట్టు వసతి కల్పనను మరింతగా పెంచే అవకాశాలపై దృష్టి పెట్టాలని సూచించాన్నారు. ప్రస్తుత విద్యుత్తు వినియోగం ఎంత ఉంది, ఎలా సమకూరుతోంది, విండ్‌ పవర్‌ సరఫరా ఎలా ఉందని ఆరా తీశారు. వేసవిలో రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారో, ఎండ ప్రభావం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. బోర్డు తాజా నిర్ణయాలను ఎంత వరకు అమలుచేశారో సీఎం అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 04:24 AM