తిరుమల గిరులకు పచ్చని ముప్పు..!
ABN , Publish Date - Jan 28 , 2026 | 07:06 AM
శేషాచలంలో పచ్చదనాన్ని పెంచే ఆలోచనతో 40 ఏళ్ల కిందట టీటీడీ చేసిన ప్రయత్నమే ఈ పరిస్థితికి కారణమైంది. వేగంగా పెరిగే స్వభావంగల కొన్ని రకాల మొక్కలను అప్పట్లో తిరుమల గిరుల్లో నాటారు.
కొండలను ఆక్రమిస్తున్న సీమ జాతి చెట్లు
స్థానిక వృక్ష జాతులు ఎదగకుండా నిరోధం
దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యత
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనంలో వెల్లడి
సీఎం చంద్రబాబు ఆదేశంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు
పదేళ్ల ప్రణాళికకు పాలకమండలి ఆమోదం
తిరుమల కొండల్లోని పచ్చదనం
దురాక్రమణకు గురవుతోంది..!
ఈ పని చేస్తున్నది ఎర్రచందనం స్మగ్లర్లో...
భూ బకాసురులో కాదు.. కొన్ని రకాల చెట్లే..!
శేషాచలంలో పచ్చదనాన్ని పెంచే ఆలోచనతో 40 ఏళ్ల కిందట టీటీడీ చేసిన ప్రయత్నమే ఈ పరిస్థితికి కారణమైంది. వేగంగా పెరిగే స్వభావంగల కొన్ని రకాల మొక్కలను అప్పట్లో తిరుమల గిరుల్లో నాటారు. అవి వేగంగా విస్తరించాయి. కానీ.. ఈ క్రమంలో ఇతర మొక్కలేవీ పెరగకుండా అడ్డుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సీమ జాతి మొక్కల విస్తరణ ఆందోళనకర స్థాయికి చేరడంతో టీటీడీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.తిరుమల శ్రీవారి ఆలయం కేంద్రంగా చుట్టూ 6,800 ఎకరాల అటవీ ప్రాంతం 27.19 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. బండలు నిండిన కొండలతో ఉన్న శేషాచలంలో పచ్చదనం పలచగా కనిపిస్తుండడంతో భారీఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని 1980లో ప్రారంభించారు. విమానాలతోనూ విత్తనాలు చల్లారు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది కూడా. అయితే అప్పట్లో నాటిన మొక్కల్లో కొన్ని సీమజాతులు.. స్థానిక రకాల చెట్లను పెరగకుండా నిరోధిస్తున్నాయి. ఈ ప్రాంత జీవ వైవిధ్యానికే ముప్పు కలిగిస్తున్నాయి. ఆక్రమణ స్వభావం కలిగిన మొక్కలు స్థానిక జాతుల ఉనికిని దెబ్బతీస్తున్నాయి. తిరుమల పరిధిలోని 6,800 ఎకరాల అడవుల్లో ఇప్పటికే 1,440 నుంచి 1,500 ఎకరాల్లో విదేశీ రకాల చెట్లు, పొదలు నిండిపోయాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనంలో ఈ ఆకుపచ్చని దురాక్రమణ అంశం వెల్లడైంది. ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు టీటీడీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో దీనిపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. నిపుణుల సూచనతో పదేళ్ల కార్యారచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించింది.
అన్ని రకాలకూ ప్రాధాన్యం
తిరుమల కొండల్లో వన్య ప్రాణులకు ఆహారంగానూ ఉపయోగపడేలా స్థానిక పళ్ల రకాల చెట్ల పెంపకంపైనా టీటీడీ దృష్టి సారించింది. నేరేడు, కరక్కాయ, తానికాయ లేదా తాండ్ర చెట్టు, ఉసిరి, పరికి, తునికి, నల్ల తుమికి, మారేడు లేదా బిల్వ, ఇప్ప వంటి పళ్ల రకాల చెట్లు పెంచనుంది. అలాగే ఔషధ మొక్కలైన సర్పగంధ, నీలవేము, తిప్ప తీగ, తులసి, తుమ్మి, అడ్డసరం లేదా మలబార్ నట్, నన్నారి, పొడపత్రి, శతావరి, వట్టివేరు, నిమ్మగడ్డి వంటి మొక్కలు, భూసారాన్ని కాపాడేందుకు ఎరుపు గోధుమ రంగులో వుండే గోల్డెన్ బియర్డ్ గ్రాస్, ఊబ గడ్డి లేదా పంది ముల్లు గడ్డి, చిగిరింత గడ్డి, కుస గడ్డి, గరిక, కొండ చీపురు గడ్డి వంటి రకాలను కూడా పెంచనుంది. అలాగే ఏడాది పొడవునా తిరుమల గిరులకు పుష్పవర్ణ శోభ కలిగించేందుకు కూడా టీటీడీ సిద్ధమవుతోంది. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరిచేందుకు పరిమళాలు వెదజల్లే పూల రకాలు, నీడనిచ్చే చెట్లను పెంచనుంది. శ్రీవారి ఆలయం పక్కనున్న పద్మ పుష్కరిణి చుట్టూ కూడా సువాసన వెదజల్లే పూల చెట్లు, భక్తుల వసతి సముదాయాల వద్ద ఔషధ వనాల పెంపకం చేపట్టనుంది.
- తిరుపతి - ఆంధ్రజ్యోతి
పదేళ్ల కాలానికి ఐదు అంచెల ప్రణాళిక
తిరుమల అడవుల్లో పెరిగిపోతున్న ఆస్ట్రేలియా తుమ్మ, సోప్ బ్రష్, సీమ తంగేడు వంటి విదేశీ రకాలను తొలగించి.. వాటి స్థానంలో స్థానిక మొక్కలు పెంచడంపై టీటీడీ దృష్టి సారించింది. ప్రత్యామ్నాయంగా రావి, మర్రి, అత్తి లేదా బ్రహ్మ మామిడి, చైనీస్ మర్రి, కొండ మర్రి, పెద్ద జువ్వి లేదా పిట్ట జువ్వి, చుక్కలి లేదా బారంకి వంటి రకాల చెట్లను పెంచనున్నారు. ఇందుకోసం తిరుమల గ్రీన్ అండ్ బయో డైవర్శిటీ యాక్షన్ ప్లాన్‌ను టీటీడీ సిద్ధం చేసింది. 2025 నుంచి 2035 వరకూ ఐదు దశలుగా ఈ ప్రణాళిక అమలు చేయనుంది. 2025-27 మధ్య మొదటి దశ కింద 175 ఎకరాల్లో విదేశీ రకాల చెట్లను తొలగించి, వాటి స్థానంలో నీడనిచ్చే స్థానిక రకాల పెంపకం చేపడతారు. 2027-29 మధ్య రెండో దశలో 375 ఎకరాల్లో విదేశీ చెట్లను తొలగించి స్థానిక ఔషధ రకాల మొక్కల నర్సరీలు ఏర్పాటు చేస్తారు. 2029-31 మధ్య మూడో దశలో 375 ఎకరాల్లో, 2031-33 మధ్య నాలుగో దశలో 300 ఎకరాల్లో, అలాగే 2033-35 మధ్య చివరిదైన ఐదో దశలో 250 ఎకరాల్లో విదేశీ రకం చెట్లను తొలగిస్తారు.

ఈ 3 జాతులతోనే ముప్పు
ఆస్ట్రేలియా తుమ్మ...
దీని ఆకులు చెవిని పోలినట్టు వుంటాయి. అందుకే దీన్ని చెవి ఆకు తుమ్మ అని కూడా పిలుస్తారు. ఇది ఆస్ట్రేలియా, ఇండొనేషియా, పపువా న్యూ గినియా దేశాలకు చెందింది. నీడ కోసం, తేనెటీగలను ఆకర్షించడం కోసం వీటిని పెంచుతారు. బాగా ఎత్తు పెరుగుతుంది.
సోప్ బ్రష్
ఉత్తర ఆస్ట్రేలియాకు చెందిన చెట్టు ఇది. వాస్తవానికి ఇది చెట్టు కాదు.. గుబురుగా పొదలా పెరుగుతుంది. ఆకులు వెండి రంగులో వుంటాయి.
సీమ తంగేడు
ఇది దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాలకు చెందిన రకం. బాగా గుబురుగా పెరుగుతుంది.