Share News

టికెట్‌ ఉన్నా దర్శనానికి పంపట్లేదు!

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:14 AM

తమకు జారీ చేసిన టికెట్‌పై వేకువజామున మూడు గంటలకు శ్రీవారి దర్శనమని ముద్రించి, తీరా వచ్చాక ఇప్పుడు కాదు ఉదయం 10 గంటలకు దర్శనానికి రమ్మన్నారంటూ ఓ భక్తుడు...

టికెట్‌ ఉన్నా దర్శనానికి పంపట్లేదు!

  • 3 గంటలకు దర్శన సమయం.. వచ్చాక 10 గంటలకు రమ్మంటున్నారు

  • సోషల్‌ మీడియాలో శ్రీవారి భక్తుడి ఆవేదన

తిరుమల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): తమకు జారీ చేసిన టికెట్‌పై వేకువజామున మూడు గంటలకు శ్రీవారి దర్శనమని ముద్రించి, తీరా వచ్చాక ఇప్పుడు కాదు ఉదయం 10 గంటలకు దర్శనానికి రమ్మన్నారంటూ ఓ భక్తుడు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ కుటుంబం శుక్రవారం వేకువజామున మూడు గంటల సమయానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందింది. దర్శనం కోసం క్యూలైన్‌లోకి వస్తే తమను అనుమతించలేదంటూ ఓ యువకుడు టీటీడీని ప్రశ్నిస్తూ సెల్ఫీ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ అంశం చర్చనీయాశంగా మారింది. ‘దర్శనం మూడు గంటలకు అని ఇచ్చారు. 2.30 గంటలకు కుటుంబ సభ్యులు, చంటి బిడ్డతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ దగ్గరికి వస్తే తిరిగి ఉదయం 10 గంటలకు రమ్మని చెప్తున్నారు. ఈ చలిలో ఎక్కడికి వెళ్లాలి. కనీసం స్పందించే వారు లేరు. విధుల్లో ఉన్నవారు అటూ ఇటూ తిప్పుతూనే ఉన్నారు. సింపుల్‌గా ప్రింటింగ్‌ మిస్టేక్‌ అని చెప్తున్నారు. దీనికెవరు బాధ్యులు’ అంటూ వీడియోలో ఆ భక్తుడు ప్రశ్నించాడు.

టీటీడీకి 14 టన్నుల కూరగాయల వితరణ

నూజివీడు టౌన్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ అన్నదాన ట్రస్టుకు ఏలూరు జిల్లా నూజివీడు మండలం దేవరగుంటకు చెందిన రైతులు 14 టన్నుల కూరగాయలను అందించారు. నూజివీడు వెంకటాచల స్వామి దేవస్థానం నుంచి టీటీడీ ప్రత్యేక వాహనంలో కూరగాయలను తరలించారు.

Updated Date - Feb 22 , 2026 | 04:15 AM