తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
ABN , Publish Date - May 19 , 2026 | 05:33 AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్ర, శని, ఆదివారాల తరహాలో సోమవారం కూడా తిరుమల రద్దీగానే కనిపించింది.
సర్వదర్శనానికి 12 గంటలు
తిరుమల, మే 18(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్ర, శని, ఆదివారాల తరహాలో సోమవారం కూడా తిరుమల రద్దీగానే కనిపించింది. వేసవి సెలవులతో పాటు మొక్కులున్న భక్తులూ అధికంగా తిరుమలకు వస్తున్న క్రమంలో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి పార్కులోని షెడ్లు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగులోరోడ్డులో శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి 12 గంటల దర్శన సమయం పడుతోంది. మరోవైపు తిరుమలకు ప్రవేశమార్గమైన అలిపిరి సోమవారం వాహనాలతో కిక్కిరిసింది. చెక్‌పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు క్యూకట్టాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాలు కూడా రద్దీగానే ఉన్నాయి.
వారాంతంలో 2.56 లక్షల మందికి దర్శనం
శుక్ర, శని, ఆదివారాల్లో 2,56,719 మంది భక్తులకు శ్రీవారి దర్శనం లభించింది. శుక్రవారం 75,688 మంది, శనివారం 90,011 మంది, ఆదివారం 91,020 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక, 1.12 లక్షల మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అలాగే రూ.10.84 కోట్లు హుండీ ఆదాయం లభించింది. మరోవైపు ఈ మూడురోజుల్లో 32,200 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 9 వేల వాహనాలు కొండెక్కడం గమనార్హం.