తిరుమల కిటకిట
ABN , Publish Date - May 02 , 2026 | 03:42 AM
తిరుమల కొండ ఒక్కసారిగా కిటకిటలాడింది. వేసవి సెలవులు, పదోతరగతి పరీక్షా ఫలితాల విడుదల నేపథ్యంలో తల్లిదండ్రులు, పిల్లలు అలిపిరి...
రెండు నడక మార్గాల్లో భక్తుల రద్దీ
సర్వదర్శనానికి 14గంటల సమయం
తిరుమల, మే 1 (ఆంధ్రజ్యోతి): తిరుమల కొండ ఒక్కసారిగా కిటకిటలాడింది. వేసవి సెలవులు, పదోతరగతి పరీక్షా ఫలితాల విడుదల నేపథ్యంలో తల్లిదండ్రులు, పిల్లలు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో కాలినడకన తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి అలిపిరి మార్గంలో 23,500 మంది, శ్రీవారిమెట్టు మార్గంలో 5,500 మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. అలాగే దాదాపు 9 వేల వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. ఇక, శనివారానికి 13 వేల ఎస్‌ఎస్డీ(స్లాటెడ్ సర్వదర్శనం), 2 వేల డీడీ(దివ్యదర్శనం) టోకెన్లను శుక్రవారం ఉదయం తిరుపతిలో కేటాయించారు. దీంతో శుక్రవారం సాయంత్రానికి తిరుమల కొండపై రద్దీ ఏర్పడింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లన్నీ సర్వదర్శన భక్తులతో నిండిపోయి...క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి గృహం సర్కిల్ మీదుగా రింగురోడ్డులో బాటగంగమ్మ ఆలయం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. వీరికి దాదాపు 14 గంటల దర్శన సమయం పడుతోంది. మరోవైపు టైంస్లాట్ టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు కూడా మూడు గంటల సమయం పడుతోంది.
15 తర్వాత ఎస్‌ఎస్డీ టోకెన్ల జారీ రద్దు
వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని నేరుగా తిరుమలకు వచ్చే భక్తులందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేలా టీటీడీ ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తిరుపతిలో రోజూ జారీ చేసే ఎస్‌ఎస్డీ టోకెన్ల జారీని ఈ నెల 15వ తేదీ తర్వాత రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారుల సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను శుక్రవారం నుంచి నిలిపివేసింది. మరో వారంరోజుల పాటు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించి ఆ తర్వాత వారి లేఖలను కూడా తీసుకోకూడదని టీటీడీ భావిస్తోంది. దీంతో అదనంగా లభించే సమయాన్ని సామాన్య భక్తుల దర్శనానికి వినియోగంచాలని యోచిస్తోంది.