Share News

తిరుమల నడక దారిలో హనుమ విగ్రహం చోరీ

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:16 AM

అలిపిరి మెట్ల మార్గంలోని ఏడవ మైలు వద్ద ఉన్న హనుమ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిపోవడం కలకలం సృష్టించింది.

తిరుమల నడక దారిలో హనుమ విగ్రహం చోరీ

  • నిందితుడి ఆచూకీ కోసం 10 బృందాలు ఏర్పాటు

  • 14 గంటల్లోనే ఒంగోలులో అరెస్ట్‌.. విగ్రహం స్వాధీనం

తిరుమల /తిరుపతి (నేరవిభాగం) / ఒంగోలుక్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): అలిపిరి మెట్ల మార్గంలోని ఏడవ మైలు వద్ద ఉన్న హనుమ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిపోవడం కలకలం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు 14 గంటలు శ్రమించి ఒంగోలులో నిందితుడిని అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. అలిపిరి నడక మార్గం, తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్‌రోడ్డు కలిసే ప్రాంతం ఏడవ మైలు. ఇక్కడ నిలువెత్తు ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహంతో పాటు భక్తులు పూజలు చేసుకునేందుకు అనువుగా సుమారు అడుగు ఎత్తు కలిగిన చిన్నపాటి రాతి హనుమ విగ్రహం ఉంది. బుధవారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఓ వ్యక్తి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్లి హనుమ విగ్రహాన్ని వస్త్రంతో కప్పి తీసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు విగ్రహాన్ని గోవిందమాల ధరించిన వ్యక్తి తీసుకెళ్లడాన్ని గుర్తించారు. నిందితుడి ఫొటో విడుదల చేశారు. వెంటనే ఎస్పీ సుబ్బరాయుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. టీటీడీ విజిలెన్స్‌ అధికారులతో కలిసి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, ప్రయాణ మార్గాలు, ఇతర కోణాల్లో ఒకేసారి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని విశాఖపట్నానికి చెందిన జశ్వంత్‌ కుమార్‌గా నిర్ధారించుకున్నారు. చోరీ అనంతరం అతను యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రె్‌సలో ప్రయాణిస్తున్నట్టు సాంకేతిక ఆధారాలతో గుర్తించి వెంటనే ఒంగోలు జీఆర్పీ పోలీసులను అప్రమత్తం చేశారు. రైలు ఒంగోలు స్టేషన్‌కు చేరుకోగానే జీఆర్పీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద హనుమ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని తిరుపతికి తరలించారు.

Updated Date - Jul 23 , 2026 | 05:18 AM