Share News

భూములు చెరబట్టిన భూమన!

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:46 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, ఇనాం భూములను అడ్డగోలుగా ఆక్రమించారు. తిరుపతికి ..

భూములు చెరబట్టిన భూమన!

  • తిరుచానూరులో 9 ఎకరాల ఇనాం భూఆక్రమణ

  • దాని విలువ 45 కోట్లుగా అంచనా

  • స్వర్ణముఖి ప్రవాహ ప్రాంతంలో ప్రహరీ నిర్మాణం

  • సమగ్ర సర్వే చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి

  • ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విజిలెన్స్‌

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, ఇనాం భూములను అడ్డగోలుగా ఆక్రమించారు. తిరుపతికి ఆనుకుని ఉన్న తిరుచానూరు పంచాయతీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఏకంగా 9 ఎకరాల ఇనాం భూమిని కబ్జా చేశారు. స్వర్ణముఖి పరీవాహక ప్రాంతంలో తనకు చెందిన పట్టా భూమితో పాటు ఇనాం భూమి చుట్టూ పెద్ద ప్రహరీ సైతం నిర్మించారు. ఇక్కడ ఎకరా సుమారు రూ.4కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన దాదాపు రూ.45 కోట్ల విలువైన ఇనాం భూమిని ఆయన ఆక్రమించారు. ఇనాం భూమితో పాటు నదీ ప్రవాహంలో అక్రమ ప్రహరీ నిర్మాణంపై ఇప్పటికే విజిలెన్స్‌ అధికారులు నివేదిక సమర్పించారు. రెవెన్యూ, ఇనాం, నీటిపారుదల శాఖ విభాగం అధికారులు కలిసి సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు గ్రామంలో 473, 474 సర్వే నంబర్లు స్వర్ణముఖి నదికి రెండువైపులా ఉన్నాయి. సర్వే నం.242 నదికి మూడు వైపులా విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం తిరుచానూరులోని సర్వే నం. 472, 473, 474లలో కరుణాకర రెడ్డి భార్య రేవతి, కుమారుడు అభినయ్‌ పేర్లతో 15.36 ఎకరాలు ఉంది. అయితే ఈ సర్వే నంబర్లలో 24.36 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట ఉంది. స్వర్ణముఖి ప్రవాహ ప్రాంతాన్ని మట్టితో పూడ్చివేసి నదిని ఆక్రమించే ఉద్దేశంతో కరుణాకర రెడ్డి ఈ మామిడితోట చుట్టూ ప్రహరీ నిర్మించారు. సర్వే నం. 474/1ఎలో ఉన్న 9ఎకరాల ఇనాం భూమి కూడా ఈ ప్రహరీ లోపలే ఉంది. అలాగే సర్వే నం.473/4పీలోని 0.49 ఎకరాల భూమికి తహసీల్దారు డిజిటల్‌ సంతకం లేదని గుర్తించారు. ఇనాం భూములతో పాటు నదిలోని కొంతభాగాన్ని భూమన ఆక్రమించినట్లు నిర్ధారించారు.


అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని

కరుణాకరరెడ్డి తన భూమిలోకి వెళ్లేందుకు రోడ్డు కోసం పక్కనున్న భూమిని తక్కువ ధరకు విక్రయించాలంటూ దాని యజమాని వెంకటేశ్వర ప్రసాద్‌ను బెదిరించారు. ఇందుకు నిరాకరించడంతో భూమన ఆయనకు చెందిన ప్లాట్లు, ఆస్తులను ఆక్రమించడం ప్రారంభించారు. 2021 నవంబరు 3న రాత్రి కొందరు గూండాలు సర్వే నం.478లోకి ప్రవేశించి, స్థానిక పోలీసులు, తుడా అధికారుల సహకారంతో వెంకటేశ్వర ప్రసాద్‌ ఆస్తి సరిహద్దుల్లోని ప్లాట్లలోని 40 మామిడి చెట్లు, 64 టేకు చెట్లను యంత్రాలతో వేళ్లతో సహా పెకిలించి వేశారు. అలాగే అక్కడి ఫెన్సింగ్‌, కాంపాండ్‌వాల్‌ను ధ్వంసం చేశారు. దీంతో ప్రసాద్‌ హైకోర్టులో రిట్‌ అప్పీలు దాఖలు చేశారు. ఇందులో కరుణాకర రెడ్డి 7వ రెస్పాండెంట్‌, ఆయన భార్య రేవతి 8వ రెస్పాండెంట్‌గా ఉన్నారు. ఈ కేసులో ప్రసాద్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

ప్రభుత్వానికి విజిలెన్స్‌ సిఫారసులివీ..

  • ప్రభుత్వ, ఇనాం భూముల్ని ఆక్రమణల నుంచి రక్షించేందుకు రెవెన్యూ, ఇనాం, నీటిపారుదల శాఖ అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించాలి.

  • సీనరేజీ రుసుం వసూలు చేయడం కోసం నదిని పూడ్చేందుకు ఉపయోగించిన గ్రావెల్‌, మట్టి పరిమాణాన్ని అంచనా వేసేందుకు మామిడి తోట, స్వర్ణముఖి ప్రవాహ ప్రాంతంలో సాయిల్‌ టెస్ట్‌ నిర్వహించాలి

  • ప్రభుత్వం సర్వే నిర్వహించి ఇనాం భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. మరోవైపు చెట్లు నరికి, భూ ఆక్రమణకు ప్రయత్నించిన వ్యక్తులపై చట్టంలోని పలు సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి.

Updated Date - Jun 25 , 2026 | 03:46 AM