Share News

పటిష్ట బందోమస్తు

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:56 PM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.

   పటిష్ట బందోమస్తు
జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్‌

ఎన్నికల విధులకు 2,155 మంది పోలీసులు

ఫ్యాక్షన గ్రామాలపై నిఘా

94 అత్యంత సమస్యాత్మక, 162 సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లు

ఎస్పీ విక్రాంత పాటిల్‌

కర్నూలు క్రైం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఓటర్లు భయాందోళనలకు, ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎస్పీ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాలోని కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు నాలుగు సబ్‌ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. 94 అత్యంత సమస్యాత్మక, 162 సమస్యాత్మక కేంద్రాలను, ఫ్యాక్షన గ్రామాలపై అదనపు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు..

ఎస్పీ నేతృత్వంలో ఇద్దరు అడిషినల్‌ ఎస్పీలు, 7 మంది డీఎస్పీలు, 39 మంది సీఐలు, 61 మంది ఎస్‌ఐలు, 87 మంది ఏఎస్‌ఐలు, 236 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 693 మంది కానిస్టేబుళ్లు, 316 మంది హోంగార్డులతో పాటు 13 ఏపీఎస్‌పీ ఫ్లటూన్లు, ఏఆర్‌ పోలీసులు, అటవీ, విజిలెన్స, ఎక్సైజ్‌ రైల్వే శాఖల సిబ్బంది కలిపి మొత్తం 2,155 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 175 రూట్‌ మొబైల్‌, 30 స్ర్టైకింగ్‌ ఫోర్స్‌, 30 స్పెషల్‌ స్ర్టైకింగ్‌ ఫోర్స్‌, 7 డీఎస్పీ స్ర్టైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహించనున్నాయి.

చెక్‌పోస్టులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌

ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు 26 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ (ఎంసీసీ), 26 స్టాటిక్‌ సర్వేలెన్స టీమ్స్‌ (ఎనఎస్‌టీ), చెక్‌పోస్టులు 11, శాంతిభద్రతల పికెట్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌ నుంచి నిరంతర పర్యవేక్షణ చేపడుతారు. ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, అల్లర్లకు కారణమయ్యే వ్యక్తులను గుర్తించి ముందస్తు బైండోవర్‌ చేపట్టారు.

అనుమతులున్న వాహనాల్లో మాత్రమే..

రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు లేదా అనుమతులున్న వాహ నాల్లో మాత్రమే ప్రయాణించాలి. అనుమతులు లేని వాహనాల్లో తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తారు. నిబంధనల ప్రకారం పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. శాంతిభద్రతకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారు వెంటనే ఓటర్లు తమ గమ్యస్థానాలకు వెళ్లిపోవాలి. పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ పోన్లు, ఇంక్‌ సీసాలు, ఇతర నిషేధిత వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, తప్పుడు ప్రచారం చేసినా, ఫుకార్లు వ్యాప్తి చేసినా వారిపై చర్యలు తప్పవు.

అందరూ సహకరించాలి

స్థానిక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులందరూ పోలీసు శాఖకు సహకరించాలి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం.

ఫ విక్రాంత పాటిల్‌, ఎస్పీ, కర్నూలు

Updated Date - Nov 04 , 2026 | 11:56 PM