Share News

ముళ్లపంది వేటలో గాయాలతోనే పులి మృతి

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:09 AM

నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డివిజన్‌ పరిధిలో పులి మృతికి ముళ్లపంది వేటలో గాయాలే కారణమని రాష్ట్ర అటవీ శాఖ నియమించిన హైలెవల్‌ కమిటీ నిర్ధారించింది.

ముళ్లపంది వేటలో గాయాలతోనే పులి మృతి

  • హైలెవల్‌ కమిటీ నిర్ధారణ

ఆత్మకూరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డివిజన్‌ పరిధిలో పులి మృతికి ముళ్లపంది వేటలో గాయాలే కారణమని రాష్ట్ర అటవీ శాఖ నియమించిన హైలెవల్‌ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు కమిటీ నిర్ధారించిన నివేదికను గురువారం ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అప్పావ్‌ వెల్లడించారు. నివేదిక వివరాలు... టీ-66ఎఫ్‌ నంబరు గల పులి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంపై విచారణకు వచ్చిన హైలెవల్‌ కమిటీ చైర్మన్‌, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు.., కన్వీనర్‌, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ రాహుల్‌ పాండే, కమిటీ సభ్యులైన డబ్ల్యుడబ్ల్యుఎఫ్-ఇండియా ల్యాండ్‌ స్కేప్‌ కోఆర్డినేటర్‌ రాజశేఖర్‌, బెంగుళూరు వైల్డ్‌లైఫ్‌ స్టడీస్‌, ఫీల్డ్‌ కన్జర్వేషనిస్ట్‌ ఇమ్రాన్‌ సిద్ధికి, రిటైర్డు డిప్యూటీ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌లతో పాటు ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అప్పావ్‌ పులి కళేబరం లభించిన ప్రదేశాన్ని ఈ నెల 3న సందర్శించి పలు వివరాలను నమోదు చేసుకున్నారు. పులి కళేబరం లభించిన పరిసరాల్లో పశువుల వేట వివరాలు, గతంలో నమోదైన వన్యప్రాణుల నేరాలు, వేట సంఘటనలు, చుట్టు పక్కల నీటి వనరుల విస్తరణ, గస్తీ ఏర్పాట్లు, కెమెరా ట్రాప్‌లను సమగ్రంగా పరిశీలించారు. అలాగే టీ-66ఎఫ్‌ కెమెరా ట్రాప్‌లలో నమోదు దృశ్యాలను, ప్రదేశాలను కూడా ఆరా తీశారు. అయితే జూలై 20, 21, 22 తేదీల్లో నమోదైన లభించిన కెమెరా ట్రాప్స్‌లో ముళ్లపంది వేటలో పులి తీవ్రంగా గాయపడినట్టు గుర్తించారు. ముళ్లపంది ముళ్లు పులి శరీరంలోకి చొచ్చుకోవడంతో ఆ గాయాల ధాటికి కోలుకోలేక అనారోగ్యానికి గురై మరణించినట్లు హైలెవల్‌ కమిటీ అభిప్రాయపడింది.

Updated Date - Aug 07 , 2026 | 05:10 AM