మళ్లీ పంజా విసిరిన పులి
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:24 AM
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి నాలుగు రోజులుగా పశువులను చంపుతూనే ఉంది.
తాజాగా మరో రెండు గేదెదూడలు హతం
ఇప్పటి వరకు ఏడు పశువులు మృత్యువాత
బుట్టాయగూడెం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా బుట్టాయగూడెం ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి నాలుగు రోజులుగా పశువులను చంపుతూనే ఉంది. తాజాగా శనివారం తెల్లవారుజామున గుర్రప్పగూడుంలో కుంజా ప్రసన్న అనే గిరిజనుడికి చెందిన పశువుల మందపై దాడిచేసింది. రెండేళ్ల వయస్సు గేదెదూడను చంపి, దూరంగా లాక్కుపోయి వెనుక భాగం మొత్తాన్ని తినేసింది. మెట్టగూడెంలో యంట్రప్రగడ నరేంద్రకు చెందిన పశువులపై దాడి చేసి ఏడాది వయసున్న గేదె దూడను చంపేసింది. 21న ఏజెన్సీలో ప్రవేశించిన పులి శనివారం వరకు ఏడు పశువులను చంపినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి జాడ కోసం వారు గాలిస్తున్న సమయంలోనే పడమట రేగులకుంట-అంతర్వేదిగూడెం గ్రామాల మధ్య బైనేరు వాగుపై నిర్మించిన వంతెన కింద పులి సేదదీరుతూ ఉండడాన్ని పలువురు ప్రయాణికులు చూశారు. భయంతో కేకలు వేయడంతో పులి చెంచుగూడెం వైపుగా వెళ్లినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి అంతర్వేదిగూడెం- పందిరిమామిడిగూడెం మధ్య పులి రోడ్డు దాటుతుండగా వాహనంలో వెళుతున్నవారు ఫోన్‌లో ఫొటో తీశారు. పులి సంచారంతో వ్యవసాయ పనులకు వెళ్లడానికి కూలీలు భయపడుతున్నారు. పులిని పట్టుకోడానికి అన్ని ప్రయాత్నాలూ చేస్తున్నామని, అంతర్వేదిగూడెం, పందిరిమామిడి గూడెం, నాగులగూడెం, గుర్రప్పగూడెం, మెట్టగూడెం, తాడితోట,బుట్టాయగూడెం, ముప్పినవారిగూడెం, పడమట రేగులకుంట ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారి దుర్గాకుమార్ బాబు తెలిపారు.