దూడను చంపిన పెద్దపులి
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:30 AM
ఏలూరు జిల్లా పోలవరం ఏజన్సీ గ్రామాల్లో పెద్ద పులి సంచారం ప్రజలను, రైతులను, కూలీలను బేంబేలెత్తిస్తోంది. సోమవారం అర్ధరాత్రి గుంజవరంలో పాడి రైతు కానెం అన్నవరానికి చెందిన గిత్త దూడను పెద్దపులి చంపి..
భయాందోళనలో పోలవరం ఏజెన్సీ వాసులు
పోలవరం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా పోలవరం ఏజన్సీ గ్రామాల్లో పెద్ద పులి సంచారం ప్రజలను, రైతులను, కూలీలను బేంబేలెత్తిస్తోంది. సోమవారం అర్ధరాత్రి గుంజవరంలో పాడి రైతు కానెం అన్నవరానికి చెందిన గిత్త దూడను పెద్దపులి చంపి.. ఈడ్చుకు వెళ్లి మొక్కజొన్న చేలో సగం తిని వదిలేసింది. తెల్లవారుజామున పాలు తీయడానికి వచ్చిన రైతుకు పులి పాదముద్రలు, మొక్కజొన్న చేలో సగం తిని వదిలేసిన దూడ కళేబరం కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు తెలిపారు. అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని బాధిత రైతుతో మాట్లాడారు. పులి మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా అది సమీపంలోనే ఉన్నట్లు గుర్తించారు. మెట్టగూడెం పక్కనే ఉన్న మొక్కజొన్న చేలో పులి కనిపించిందంటూ ఫోన్ రావడంతో అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లారు. పశువులను మేపుతున్న తాము.. పెద్ద పులిని చూసి కేకలు వేయడంతో అది పొదల్లోకి వెళ్లిపోయిందని గిరిజనులు తెలిపారు. ట్రాకర్ ద్వారా పరిశీలించిన అధికారులు పులి అక్కడికి 200 మీటర్ల దూరంలోనే ఉందని తెలుసుకుని అటవీ క్షేత్రాధికారి ఎస్‌కే వలీ, జంగారెడ్డిగూడెం డీఎఫ్‌వో వెంకటసుబ్బయ్య, రాజమహేంద్రవరం నుంచి వచ్చిన అదనపు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని సమీప గ్రామాల్లో అటవీ సిబ్బంది ప్రచారం చేశారు. రైతులు, కూలీలు భయాందోళనతో ఇళ్లకు చేరుకున్నారు. పులి బెడద కాపాడి, పాడి పశువులను రక్షించాలని స్థానికులు అటవీ శాఖ అధికారులను కోరారు.