పూసిగొందిలో గిత్తను చంపిన పులి
ABN , Publish Date - Jun 28 , 2026 | 05:46 AM
ఏలూరు జిల్లా ఏజెన్సీలో పులి పంజా విసురుతూనే ఉంది. తాజాగా శనివారం తెల్లవారుజామున బుట్టాయగూడెం మండలం పూసిగొంది కొండరెడ్డి గ్రామం సమీపంలో మరో గిత్తను చంపేసింది.
బుట్టాయగూడెం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ఏజెన్సీలో పులి పంజా విసురుతూనే ఉంది. తాజాగా శనివారం తెల్లవారుజామున బుట్టాయగూడెం మండలం పూసిగొంది కొండరెడ్డి గ్రామం సమీపంలో మరో గిత్తను చంపేసింది. రేపల్లె నుంచి డోలుగండి, గొట్టాలరేవు, చింతకొండ, గానుగమామిడి మీదుగా కొండలను దాటుకుంటూ పూసిగొంది వైపుగా వచ్చిన పులి గ్రామానికి చెందిన కెచ్చెల గంగరాజుకు చెందిన గిత్తను చంపేసింది. తెల్లవారుజామున పశువులు బెదిరి భయంతో గ్రామంలోకి పరుగులు తీస్తూ రావడంతో కొండరెడ్లు అడవి వైపుగా వెళ్లగా గిత్తను తింటున్న పులి వారిని చూసి అడవిలోకి పారిపోయింది. రెడ్డిబోడ్డేరు అటవీ ప్రాంతంలో పులి తిష్ట వేసినట్టు అటవీ అధికారులు గుర్తించారు. గిత్తను తినడానికి పులి మళ్లీ వస్తుందని భావిస్తున్న అధికారులు దానికి మత్తు ఇచ్చి బంధించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పూసిగొంది. గొట్టాలరేవు, చింతకొండ, గానుగమామిడి, రెడ్డిబోడ్డేరు, మోతుగూడెం, తానిగూడగెం పరిసర గ్రామాలకు చెందిన కొండరెడ్డి గిరిజనులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, పశువులను ఇళ్ల వద్దనే ఉంచాలని అటవీ అధికారులు సూచించారు. కాగా, ఇప్పటివరకు పులి దాడిలో చనిపోయిన పశువుల సంఖ్య ఐదుకు చేరుకుంది.