Share News

బాబోయ్‌.. పులి!

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:41 AM

ఇప్పటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్దపులి ఇప్పుడు తూర్పుగోదావరిలోకి ప్రవేశించింది. ఆదివారం వేకువజామున రాజమహేంద్రవరం రూరల్‌...

బాబోయ్‌.. పులి!

  • ‘తూర్పు’లోకి ప్రవేశించిన పెద్దపులి

  • తొర్రేడులో మూడు పశువులు హతం

  • భయం గుప్పిట్లో గ్రామస్థులు

  • సంఘటన స్థలానికి నేతలు, అధికారులు

  • ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతుండగానే బయటికొచ్చిన పులి

  • కేకలు వేస్తూ పరుగు తీసిన జనం

  • పులిని గుర్తించి పట్టుకునేందుకు ట్రాప్‌ కెమెరాలు, బోను ఏర్పాటు

రాజమహేంద్రవరం రూరల్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్దపులి ఇప్పుడు తూర్పుగోదావరిలోకి ప్రవేశించింది. ఆదివారం వేకువజామున రాజమహేంద్రవరం రూరల్‌ మండలం తొర్రేడు గ్రామంలో అరటి తోట సమీపంలో కట్టి ఉన్న పశువులపై దాడి చేసి చంపేసింది. పులి పాదముద్రలను బట్టి పులి వచ్చిందని గుర్తించి స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. డీఎ్‌ఫవో ప్రభాకరరావు కథనం ప్రకారం.. తొర్రేడులో పశువుల మందపై దాడి చేసి రెండు ఆవులను చంపి, దూడను లాక్కొని పోయింది. ఆదివారం ఉదయం రెవెన్యూ పోలీసు, అటశావీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పులి పాదముద్రలను పరిశీలించారు. మృతి చెందిన దూడను ఆ ప్రాంతంలో ఉన్న అరటి తోటలో పడేసినట్లు గుర్తించారు. కాగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు.


గోరంట్ల మాట్లాడుతుండగానే..

ఎమ్మెల్యే గోరంట్ల అధికారులతో కలిసి.. పులి దూడను ఈడ్చుకు వెళ్లిన ప్రాంతంలో కొంత దూరం వెళ్లారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో సుమారు 70 నుంచి 80 మీటర్ల దూరంలో పులి అరటి తోట నుంచి దూడను ఈడ్చుకు వెళ్లిన మార్గంలోనే రావడాన్ని కొంతమంది బిగ్గరగా కేకలు వేస్తూ భయంతో పరుగులు పెట్టారు. దీంతో పులి మొక్కజొన్న తోటలోకి వెళ్లిపొయింది. పులిని అతి దగ్గరలో చూసిన ప్రజలు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో డ్రోన్‌ కెమెరాలు వినియోగించి ఉంటే పులి ఆచూకీ దొరికి ఉండేదని పలువురు అన్నారు. పులిని పట్టుకొనేందుకు పలుచోట్ల 12 ట్రాప్‌ కెమెరాలు, ఒక బోను ఏర్పాటు చేశారు. పులి సంచారంతో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే గోరంట్ల సూచించారు. గ్రామంలో మైక్‌తో చాటింపు వేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

Updated Date - Feb 02 , 2026 | 06:44 AM