Share News

వాహనం ఢీకొని పులి పిల్ల మృతి

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:16 PM

అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిందో... లేక దాహం తీర్చుకోవడానికి బయటపడిందో తెలియదుగాని..

   వాహనం ఢీకొని పులి పిల్ల మృతి
మృతిచెందిన పులి పిల్ల

ఆస్పరి మండలం అట్టేకల్లు దగ్గర ఘటన

వన్యప్రాణుల రక్షణపై ఆందోళన

ఆదోని, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిందో... లేక దాహం తీర్చుకోవడానికి బయటపడిందో తెలియదుగాని.. ఓ పులిపిల్ల వేగంగా వచ్చిన వాహనానికి బలై పోయింది. కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఆస్పరి మండలం అట్టేకల్లు గ్రామ సమీపంలోని పరిదప్ప పొలం వద్ద నలకదొడ్డి గ్రామానికి చెందిన దాలే లింగన్న పొలం దగ్గర ఈ విషాదం చోటు చేసుకుంది. కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిని దాటుతున్న పులి పిల్లను గుర్తు తెలియని వాహనం ఒకటి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులిపిల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వాహనదారులు, రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వేసవి తాపం మొదలవడంతో అటవీ ప్రాంతాల్లో నీటి కుంటలు ఎండిపోవడం వల్ల వన్యప్రాణులు తాగునీటి కోసం జనావాసాల్లోకి, రహదారులపైకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, అటవీశాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Updated Date - Mar 06 , 2026 | 11:16 PM