Share News

హమ్మయ్య.. పులి అడవిలోకి వెళ్లింది!

ABN , Publish Date - Jan 28 , 2026 | 05:37 AM

పశ్చిమ ఏజెన్సీని వారంపాటు గజగజలాడించిన పెద్దపులి ఎట్టకేలకు మంగళవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో తిరిగి అభయారణ్యంలోకి వెళ్లిపోయింది.

హమ్మయ్య.. పులి అడవిలోకి వెళ్లింది!

  • యథావిధిగా పొలం పనులకు రైతులు

  • చివరి పంజాకు మరో రెండు మూగజీవాలు బలి

కొయ్యలగూడెం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): పశ్చిమ ఏజెన్సీని వారంపాటు గజగజలాడించిన పెద్దపులి ఎట్టకేలకు మంగళవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో తిరిగి అభయారణ్యంలోకి వెళ్లిపోయింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోని బిల్లిమిల్లి ప్రాంతం నుంచి బయల్దేరిన పులి కండ్రికగూడెం వద్ద జీలుగుమిల్లి-పోలవరం జాతీయ రహదారిని దాటి బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు పలుచోట్ల మూగజీవాలను బలిగొన్న పులి.. చివరిగా కె.ఆర్‌.పురం పంచాయతీ పరిధిలోని అమ్మపాలెంలో యల్లంపాటి సత్యనారాయణకు చెందిన గేదె దూడను మంగళవారం తెల్లవారు జామున చంపేసింది. అంతకు ముందు మంగపతి దేవిపేటలో ఆవు దూడను చంపేసింది. అక్కడి నుంచి అమ్మపాలెం వద్దకు చేరుకుని కన్నాపురం, పులిరామన్నగూడెం రహదారిని దాటి కామయ్యకుంట చేరుకుని అక్కడి నుంచి కొవ్వాడ కాల్వలోకి దిగి లంకపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టు అధికారులు తెలిపారు. అయితే పులి మళ్లీ అడవి నుంచి బయటికొచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో ట్రాప్‌ కెమెరాలను అమర్చారు. మొత్తంమీద 12 పశువులు పులి దాడిలో చనిపోయాయి. వారం రోజులుగా హడలెత్తించిన పులి ఎట్టకేలకు అడవిలోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి వారివారి పొలాలకు తరలివెళ్లారు.

Updated Date - Jan 28 , 2026 | 05:37 AM