Share News

హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణం

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:54 AM

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్‌, చింతలపూడి పురుషోత్తంకుమార్‌ సోమవారం ప్రమాణం చేశారు...

హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణం

అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్‌, చింతలపూడి పురుషోత్తంకుమార్‌ సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ లిసాగిల్‌ వీరితో ప్రమాణం చేయించారు. అంతకుముందు వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము జారీ చేసిన ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ జనరల్‌ పార్థసారథి చదివి వినిపించారు. న్యాయాధికారుల కోటాలో పదోన్నతిపై గంధం సునీత, ఆలపాటి గిరిధర్‌, చింతలపూడి పురుషోత్తంకుమార్‌లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది మే 4న కేంద్రానికి సిఫారసు చేసింది. వీరి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో సీజే జస్టిస్‌ లిసాగిల్‌ సోమవారం ప్రమాణం చేయించారు. హైకోర్టులో 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 29గా ఉంది. కొత్తగా వచ్చిన అదనపు న్యాయమూర్తులతో ఈ సంఖ్య 32కి చేరింది. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, అదనపు ఏజీ సాంబఽశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌, రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్‌ బట్టు దేవానంద్‌తో జస్టిస్‌ గంధం సునీత, జస్టిస్‌ డి. రమే్‌షతో జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌, జస్టిస్‌ రవినాథ్‌తిల్హరితో జస్టిస్‌ చింతలపూడి పురుషోత్తంకుమార్‌లు కేసులు విచారించారు.

కొత్త వారి నేపథ్యం ఇదీ..

జస్టిస్‌ గంధం సునీత..

2000-08 వరకు బెజవాడ బార్‌లో అసోసియేషన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా గుడివాడలో 2008-10 వరకు సేవలందించారు. ఆ తర్వాత 2010లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. విశాఖపట్నం సీబీఐ కోర్టు జడ్జిగా, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రధాన న్యాయాధికారిగా పనిచేశారు. 2019-23 వరకు హైకోర్టులో వివిధ హోదాల్లో రిజిస్ట్రార్‌గా పనిచేశారు. 2023 నుంచి తూర్పుగోదావరిజిల్లా ప్రధాన న్యాయాధికారిగా సేవలు అందించారు.

1.jpg

జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌..

ప్రకాశంజిల్లాకు జస్టిస్‌ గిరిధర్‌ ఒంగోలు జిల్లా కోర్టులో తొమిదేళ్లు, ఉమ్మడి హైకోర్టులో మూడేళ్లు ప్రాక్టీస్‌ చేశారు. మచిలీపట్నం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయాధికారిగా పనిచేశారు. విజయనగరం, కర్నూలు జిల్లాల ప్రధాన న్యాయాధికారిగా సేవలందించారు. హైకోర్టులో వివిధ హోదాల్లో రిజిస్ట్రార్‌గా పనిచేశారు. అనంతరం విశాఖపట్నం జిల్లా జడ్జిగా, ఏపీ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా పనిచేశారు. జస్టిస్‌ గిరిధర్‌ సతీమణి వెంకట శేషమ్మ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్నారు.

3.jpg

జస్టిస్‌ పురుషోత్తంకుమార్‌..

విశాఖపట్నానికి చెందిన జస్టిస్‌ పురుషోత్తంకుమార్‌.. 2012లో రాజమహేంద్రవరం ఫ్యామిలీ కోర్టులో న్యాయాధికారిగా పనిచేశారు. తర్వాత తిరుపతి అదనపు జిల్లా జడ్జిగా, 2019లో ప్రకాశంజిల్లా ప్రధాన న్యాయాధికారిగా సేవలందించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌గా రెండేళ్లు వివిధ హోదాల్లో సేవలు అందించారు. అనంతరం కడప, పశ్చిమ గోదావరి జిల్లా పీడీజేగా పనిచేశారు. 2025, జనవరి 25 నుంచి ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

2.jpg

Updated Date - Jul 07 , 2026 | 04:54 AM