Konaseema District: 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధం!
ABN , Publish Date - Jan 10 , 2026 | 06:10 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఐదు రోజుల క్రితం సంభవించిన బ్లోఔట్‌లో ఇప్పటి వరకూ 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపాలు మంటల్లో..
బ్లో ఔట్ బావి వద్ద శరవేగంగా శకలాల తొలగింపు
ఘటనా ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
అమలాపురం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఐదు రోజుల క్రితం సంభవించిన బ్లోఔట్‌లో ఇప్పటి వరకూ 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపాలు మంటల్లో దగ్ధమైనట్టు ఓఎన్జీసీ అధికారుల అంచనా వేశారు. ఓఎన్జీసీ మోరి-5 బావి వద్ద బ్లోఔట్ వల్ల ఏర్పడిన మంటలు శుక్రవారానికి తగ్గుముఖం పట్టడంతో ఓఎన్జీసీ సిబ్బంది వాటర్ అంబ్రెల్లాల ద్వారా నీటిని వెదజల్లుతూ దగ్గర వరకు వెళ్లి శకలాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు. నిపుణులైన ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఒకవైపు శకలాల తొలగిస్తూనే.. మరోవైపు బావిని మూసివేసేందుకు అవసరమైన పరికరాలను బ్లోఔట్ సైట్ వద్దకు తరలిస్తున్నారు. బ్లోఔట్ నియంత్రణకు మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బ్లో ఔట్ ప్రాంతం వద్ద ఓఎన్జీసీ నిపుణులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మంటలను అదుపు చేయాలని కోరారు.
ఏరియల్ సర్వే: కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లోఔట్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాయవరం పర్యటనకు వెళ్తున్న సమయంలో బ్లోఔట్ ప్రదేశంలో మంటల తీవ్రతను ఆయన హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం రాయవరం గ్రామంలో కోనసీమ జిల్లాకు చెందిన అధికారులతో బ్లోఔట్ పరిస్థితిపై ప్రత్యేకంగా సమీక్షించారు. అమలాపురం ఎంపీ హరీ్‌షబాలయోగి, కోనసీమ కలెక్టర్ ఆర్.మహే్‌షకుమార్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌తోపాటు ఓఎన్జీసీ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. బ్లోఔట్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ మహే్‌షకుమార్ సీఎం చంద్రబాబుకు వివరించారు. స్పందించిన సీఎం... బ్లోఔట్ వల్ల పంటలకు సంభవించిన నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.