‘డ్రగ్స్-కాల్పుల’ కేసులో దూకుడు!
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:11 AM
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కాల్పులు, డ్రగ్స్ కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను 3 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
పోలీసు కస్టడీకి ముగ్గురు ప్రధాన నిందితులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/శంషాబాద్ రూరల్)
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కాల్పులు, డ్రగ్స్ కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను 3 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు సోమవారం ఆదేశా లు జారీ చేసింది. దీనితో వారిని ప్రశ్నించేందుకు ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సిద్ధమైంది. దర్యాప్తులో మిగతా నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ముగ్గురు ప్రధాన నిందితులను ప్రశ్నించనుంది. మొయినాబాద్‌లో రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు పాల్గొన్న పార్టీలో డ్రగ్స్ లభించడం, తనిఖీలకు వెళ్లిన పోలీసులపై నిందితులు జరిపిన కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోహిత్‌రెడ్డి, నమిత్ శర్మ, రితీష్ రెడ్డి అరెస్టయి, జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్, మరో ఏడుగురు నిందితులు స్టేషన్ బెయిల్‌పై బయట ఉన్నారు.
లోక్‌సభ సమావేశాల అనంతరం విచారణకు వస్తానని పుట్టా మహేశ్ చెప్పడంతో.. మిగతా ఏడుగురు నిందితులను సిట్ బృందం రోజువారీగా విచారిస్తోంది. నిందితుల్లో కొందరికి దుబాయ్‌లో పెట్టుబడులు ఉండటం, డ్రగ్స్, నేర మాఫియాలతో సంబంధాలు ఉన్నట్టు తెలియడంతో వారి ఆర్థిక లావాదేవీలను సిట్ ఆరా తీస్తోంది. ఇప్పుడు ప్రధాన నిందితులను కస్టడీలోకి తీసుకుంటుండటంతో కేసు మూలాలన్నీ బయటికి వస్తాయని భావిస్తోంది. ఇప్పటివరకు గుర్తించిన ఆధారాలు, సమాచారాన్ని వారి ముందుపెట్టి ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది. మంగళవారం ఉదయం కస్టడీలోకి తీసుకోగానే వారిని మొయినాబాద్ ఫామ్‌హౌ్‌సకు తీసుకువెళ్లి, సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే అవకా శం ఉందని తెలిసింది. కాగా.. ఈ సందర్భంగా అభిషేక్ సింగ్ ఇప్పటివరకు 24సార్లు రోహిత్‌రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తేలింది. దీనితో ఆ 24 పార్టీలపై పోలీసులు ఫోకస్ పెట్టారు.