Demise Threats: చంపేస్తామంటున్నారు
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:05 AM
తనను, తన తమ్ముడు కిరణ్ యాదవ్‌ను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ (ఏ-2) ఆందోళన వ్యక్తం చేశారు.
అవినాశ్‌ను ఎందుకు ఇబ్బందిపెడుతున్నారు?
మిమ్మల్ని చంపేస్తే దిక్కెవరని ఓ వ్యక్తి బెదిరించాడు
పోలీసులకు ఏ-2 సునీల్ యాదవ్ ఫిర్యాదు
పులివెందుల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): తనను, తన తమ్ముడు కిరణ్ యాదవ్‌ను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ (ఏ-2) ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన, ఆయన భార్య బుధవారం రాత్రి పులివెందుల అర్బన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం సునీల్ మీడియాతో మాట్లాడారు. ‘హత్య’ సినిమాలో చూపించిన తన తల్లిపాత్రను వైసీపీ సోషల్ మీడియాలో, వైసీపీ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసి తన కుటుంబ పరువును దిగజార్చారని.. దీనిపై తాను గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. బుఽధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తన రెండు నెలల కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చూపించేందుకు తన తమ్ముడు కిరణ్ యాదవ్, తన భార్య ధనలక్ష్మి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రికి వెళ్లారన్నారు. వారు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఓ ఫంక్షన్ హాలు వద్ద ఎదురుగా వస్తున్న వ్యక్తి వారిని ఆపి.. ‘ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని, వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు పవన్‌కుమార్‌ను మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? మిమ్మల్ని ఇప్పుడు చంపితే దిక్కెవరు’ అని బెదిరించాడని.. తాను పవన్‌కుమార్ స్నేహితుడినని చెప్పి వెళ్లిపోయాడని సునీల్ తెలిపారు. దీంతో తన తమ్ముడు, భార్య భయభ్రాంతులకు గురై ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తనకు చెప్పారని.. వెంటనే అర్బన్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై సీఐ సీతారామిరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. సునీల్ ఫిర్యాదు చేశారని.. విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.