Share News

ఇదేం ‘దారి’ద్య్రం!

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:55 AM

గత వైపీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మచిలీపట్నం-కమ్మవారిచెరువు రోడ్డు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. రూ.39 కోట్లు మంజూరు చేయించింది. అదే ఉత్సాహంతో గత జనవరి 7వ తేదీన ఆర్‌అండ్‌బీ శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డితో కలిసి స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో ఇక తమ కష్టాలు తీరనున్నాయని సౌత మండలంలోని 12 పంచాయతీల ప్రజలు సంబరపడ్డారు. అయితే వారి ఆనందంపై నీళ్లు చల్లుతూ కాంట్రాక్టర్‌ ఇప్పటి వరకు పనులు ప్రారంభంలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇదేం దారిద్య్రం అంటూ తలలు పట్టుకుంటున్నారు. గోతుల రోడ్డులో నరకయాతన అనుభవిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు.

ఇదేం ‘దారి’ద్య్రం!

- మచిలీపట్నం-కమ్మవారిచెరువు రోడ్డు అభివృద్ధికి రూ.39 కోట్లు మంజూరు

- గత జనవరి 7న ఆర్భాటంగా ఇద్దరు మంత్రుల శంకుస్థాపన

- ఇప్పటివరకు పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌

- ఫోన్‌కు కూడా అందుబాటులోకి రావడంలేదంటున్న ఆర్‌అండ్‌బీ అధికారులు

- అధ్వాన రోడ్డుతో అవస్థలు పడుతున్న 12 పంచాయతీల ప్రజలు

గత వైపీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మచిలీపట్నం-కమ్మవారిచెరువు రోడ్డు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. రూ.39 కోట్లు మంజూరు చేయించింది. అదే ఉత్సాహంతో గత జనవరి 7వ తేదీన ఆర్‌అండ్‌బీ శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డితో కలిసి స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో ఇక తమ కష్టాలు తీరనున్నాయని సౌత మండలంలోని 12 పంచాయతీల ప్రజలు సంబరపడ్డారు. అయితే వారి ఆనందంపై నీళ్లు చల్లుతూ కాంట్రాక్టర్‌ ఇప్పటి వరకు పనులు ప్రారంభంలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇదేం దారిద్య్రం అంటూ తలలు పట్టుకుంటున్నారు. గోతుల రోడ్డులో నరకయాతన అనుభవిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

మచిలీపట్నం సౌత మండలంలోని అన్ని గ్రామాలకు మచిలీపట్నం- కమ్మవారిచెరువు ప్రధాన రహదారిగా ఉంది. మరో మార్గం తప్పితే మరో దారి లేదు. మండలంలోని 12 పంచాయతీలకు చెందిన ప్రజలు ఈ రహదారి నుంచే నిత్యం రాకపోకలు సాగించాలి. ఈ రహదారి గోతులమయంగా మారడంతో స్థానికుల అభ్యర్థన మేరకు మంత్రి కొల్లు రవీంద్ర రూ.39 కోట్ల నిధులను తీసుకువచ్చారు. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు.

పనుల అంచనాలు ఇలా..

మచిలీపట్నం-కమ్మవారిచెరువు రహదారి నెంబరు 358కి సంబంధించి మరమ్మతులు, అభివృద్ధి కోసం రెండు రకాలుగా పనులుగా విభజించారు. ఈ రహదారి 0 కిలోమీటరు నుంచి 3.200 కిలోమీటరు వరకు, 3.500 కిలోమీటరు నుంచి 4.351 కిలోమీటరు వరకు, 6.700 కిలోమీటరు నుంచి 7.400 కిలోమీటరు వరకు, 7.800 కిలోమీటరు నుంచి 8.200 కిలోమీటరు వరకు, 8.950 కిలోమీటరు నుంచి 9వ కిలోమీటరు వరకు, అలాగే 22.800 కిలోమీటరు నుంచి 23.200 కిలోమీటరు వరకు రహదారి అభివృద్ధి, మరమ్మతుల పనులు చేసేందుకు స్టేట్‌ హైవే అడిషనల్‌ ప్లాన్‌ నిధులు రూ.6 కోట్లను కేటాయించారు. నిధులు కూడా విడుదల చేశారు. 9.400 కిలోమీటరు నుంచి 22.800 కిలోమీటరు వరకు సింగిల్‌ రహదారిగా ఉన్న ఈ రోడ్డును డబుల్‌ రోడ్డుగా విస్తరించేందుకు న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిధుల నుంచి రూ.33 కోట్లను కేటాయించారు. ఈ ఏడాది జనవరిలో ఈ పనులకు ఆర్‌అండ్‌బీ శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి, స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. దీంతో గుంతలమయంగా ఉన్న ఈ రహదారి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందనే ఆశతో మండల ప్రజలు ఉన్నారు.

వైసీపీ పాలనలో ఉన్న రోడ్డును పగులగొట్టారు

ఇదే రహదారిని వైసీపీ ప్రభుత్వ హయాంలో చిన్నాపురం నుంచి కమ్మవారిచెరువు వరకు విస్తరించేందుకు సక్రమంగా ఉన్న రోడ్డును పగులగొట్టారు. అనంతరం వివిధ కారణాలతో ఈ పనులను నిలిపివేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ రహదారిని ఇలానే వదిలేయడంతో సముద్ర తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు నిధులు విడుదల చేసినా పనులు ప్రారంభించడం లేదు. రహదారిపై ఉన్న పెద్ద గోతులను పూడ్చే పనులు కూడా ఇంతవరకు చేపట్టలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కిరాయికి రాని లారీలు

ఈ రహదారి వెంబడి చివరి ప్రాంతంలో ఉన్న కొత్తపల్లెతుమ్మలపాలెంలో రూ.50 లక్షలతో రహదారి పనులు ప్రారంభించారు. ఈ పనుల నిమిత్తం కంకర తీసుకువచ్చేందుకు లారీ యజమానులు ముందుకు రావడంలేదు. అదేమని అడిగితే రహదారి గుంతలమయంగా మారడంతో కంకరలోడుతో లారీలు వెళితే కమాన్‌కట్టలు విరిగిపోతున్నాయని, అందుకే ఈ రహదారి వెంబడి కిరాయికి వాహనాలు పెట్టడం లేదని లారీ యజవనులు చెబుతున్నారు. అదనంగా ఒక్కోలారీకి రూ.5వేలు కిరాయి ఇస్తామని చెప్పినా లారీలను కిరాయికి పంపకపోవడం గమనార్హం. రోజువారీ ప్రయాణాలు చేసేవారు, మచిలీపట్నంలోని పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యసేవలు అవసరమైన వృద్ధులు, గర్భిణులు ఈ రహదారిపై ప్రయాణమంటే హడలిపోతున్నారు.

కాంట్రాక్టర్‌ స్పందించడం లేదు

మచిలీపట్నం-కమ్మవారిచెరువు రహదారి పనుల టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఈ పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నారు. ఫోన్‌కు కూడా అందుబాటులోకి రావ డం లేదు. ఏప్రిల్‌లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

-సంగీత, ఆర్‌ఆండ్‌బీ డీఈ, మచిలీపట్నం

Updated Date - Mar 07 , 2026 | 12:55 AM