వెంటపడితేనే పనులు!
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:53 AM
కేంద్రంతో ముడిపడి ఉన్న పనులు వెంటపడితే తప్ప కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఓఆర్‌ఆర్ ఫైనాన్షియల్ ప్రపోజల్స్, బైపాస్ కోర్టు వివాదాలు, మెట్రోకు తుది అనుమతులు, విజయవాడ ఎయిర్‌పోర్టు టెర్మినల్ టెండర్ల ఖరారు, ఎన్‌హెచ్- 65 విస్తరణ ఇలా అనేక ప్రాజెక్టులు కోఆర్డినేషన్ చేసే వారు లేక ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు తప్పితే.. కింది స్థాయిలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బలం సరిపోవడంలేదు. ప్రభుత్వ స్థాయిలో నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకునే వ్యవస్థలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా, రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ సెల్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
-కేంద్రంతో ముడిపడి ఉమ్మడి కృష్ణాలో అనేక ప్రాజెక్టులు
- కోఆర్డినేషన్ సెల్‌ల ఏర్పాటు అత్యవసరం
- ఓఆర్‌ఆర్, ఎన్‌హెచ్- 65, ఫ్లైఓవర్లు, బైపాస్ సమస్యలు ఎక్కడివి అక్కడే!
- విజయవాడ మెట్రోకు టెండర్లు పిలిచినా.. అనుమతులు రావాయె!
- రైల్వే ప్రాజెక్టుల సాకారంలోనూ జాప్యం
- నిత్యం కోఆర్డినేషన్ చేస్తేనే .. ఇవి పట్టాలెక్కుతాయి!
కేంద్రంతో ముడిపడి ఉన్న పనులు వెంటపడితే తప్ప కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఓఆర్‌ఆర్ ఫైనాన్షియల్ ప్రపోజల్స్, బైపాస్ కోర్టు వివాదాలు, మెట్రోకు తుది అనుమతులు, విజయవాడ ఎయిర్‌పోర్టు టెర్మినల్ టెండర్ల ఖరారు, ఎన్‌హెచ్- 65 విస్తరణ ఇలా అనేక ప్రాజెక్టులు కోఆర్డినేషన్ చేసే వారు లేక ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు తప్పితే.. కింది స్థాయిలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బలం సరిపోవడంలేదు. ప్రభుత్వ స్థాయిలో నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకునే వ్యవస్థలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా, రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ సెల్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కేంద్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టుల సాకారానికి నిరంతర పర్యవేక్షణ కోసం అత్యవసరంగా కోఆర్డినేషన్ సెల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ కోఆర్డినేషన్ సెల్స్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి పలు కేంద్ర ప్రాజెక్టుల సాకారం విషయంలో కోఆర్డినేషన్ లోపం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి చూస్తే ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో సింహభాగం అలైన్‌మెంట్ వెళుతోంది. ఓఆర్‌ఆర్‌కు సంబంధించి ఇక్కడి ఎన్‌హెచ్ అధికారులు ఫైనాన్షియల్ ప్రపోజల్స్‌ను తయారు చేసి ఎన్‌హెచ్‌కు పంపారు. ఎన్‌హెచ్ నుంచి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్)కు వెళ్లాల్సి ఉంది. మోర్త్ కూడా ఆమోదిస్తే.. పబ్లిక్ అండ్ ప్రైవేటు పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ)కి వెళ్లాలి. ఇందులో కూడా ఆమోదం పొందిన తర్వాత కేంద్ర క్యాబినెట్‌కు వెళుతుంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదించాక.. మళ్లీ అధికారికంగా గజిట్ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంటుంది. గత రెండు నెలలుగా ఏదైతే స్టేజ్‌లో ఉందో అదే విధంగా ఇప్పుడు కూడా పరిస్థితి ఉంది. ఎన్‌హెచ్ అధికారులు జూన్ నాటికి అనుమతులు వస్తాయని చెబుతున్నా.. అనుమానంగానే ఉంది.
పలు ప్రాజెక్టుల పరిస్థితి ఇలా..
కేంద్రం స్థాయిలో దశల వారీగా జరగాల్సిన కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు నడిపించాలంటే.. మనం అడిగితేనే.. తరచూ ఫాలో అప్ చేస్తేనే.. అది సాధ్యమవుతుంది. లేకుంటే ఎక్కడివి అక్కడే ఉంటాయి.
- విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు కూడా పిలిచారు. టెండర్లు పిలిచి నెలలు గడిచినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ఎలాంటి అనుమతులు రాలేదు. దీంతో టెండర్లు పిలిచి కూడా వాటిని ఖరారు చేయకుండా.. పనులు చేపట్టలేని దుస్థితి నెలకొంది.
-హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం ఎన్‌హెచ్ - 65 విస్తరణ వ్యవహారంలో ఎలివేటెడ్ కారిడార్లు, బైపాస్‌ల విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవి ఒక కొలిక్కి రావడం లేదు. దీంతో టెండర్ల దశ వరకు వెళ్లలేకపోతోంది. ఏడాది కాలంగా ఈ అంశం సాగుతోంది.
- మరోవైపు ఎన్‌హెచ్- 65ను బందరుపోర్టుకు అనుసంధానించే రహదారుల అంశాల మీద కూడా స్పష్టత రావడం లేదు.
- విజయవాడ వెస్ట్ బైపాస్‌కు సంబంధించి ప్యాకేజీ- 3లో జక్కంపూడి దగ్గర చిన్న సమస్య ఉంది. ఓ ప్రైవేటు సంస్థ స్టే తెచ్చుకోవడంతో పనులు ఆగిపోయాయి. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయితే తప్ప.. పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదు.
- ఎన్‌హెచ్-16పై మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు ఫ్లై ఓవర్ ప్రాజెక్టు డీపీఆర్ స్టేజీకి వచ్చాక.. మెట్రో కారణంగా నెలకొన్న జాప్యంతో కేంద్రం ఫ్లై ఓవర్ ప్రాజెక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఈ ప్రతిపాదనను మళ్లీ ముందుకు తీసుకు వచ్చారు. దీనిపై కేంద్రానికి బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది.
- ఇక రైల్వే ప్రాజెక్టుల విషయానికి వస్తే అమరావతి నూతన రైల్వేలైన్ అంశం కూడా వేగంగా అడుగులు పడటం లేదు.
- మచిలీపట్నం - రేపల్లె రైల్వే ప్రాజెక్టుకు కూడా అంగీకరించినా.. కార్యరూపం దాల్చడం లేదు.
- విజయవాడ ఎయిర్‌పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ టెండర్లకు సంబంధించిన అంశం కూడా ఇంకా కొలిక్కిరాలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న మౌలిక వసతుల ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. వీటి కన్నా కూడా పైన చెప్పుకున్న అంశాలకు సంబంధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ చేసుకోవటానికి ప్రత్యేక సెల్స్ ఉంటే.. జాప్యం లేకుండా ముందుకు సాగుతాయి. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.