ఫ 15తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగలు
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:28 PM
ఎమ్మిగనూరు మండలంలోని బోడబండలో సోమవారం పెద్ద నర్సిరెడ్డి ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది.
ఎమ్మిగనూరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు మండలంలోని బోడబండలో సోమవారం పెద్ద నర్సిరెడ్డి ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు నగలు ఎత్తుకెళ్లారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామంలో నివాసం ఉంటున్న పెద్ద నర్సిరెడ్డి పనినిమిత్తం ఆదోనికి వెళ్లాడు. ఆయన కుమారులు పొలానికి వెళ్లగా భార్య ఇంటికి తాళం వేసి గ్రామంలోని పాత ఇంటి దగ్గరకు వెళ్లింది. ఇంటి తాళాలను పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి అందులో ఉన్న 15తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. వస్తువులను చిందరబందరగా పడేసి వెళ్లారు. ఆదోనికి వెళ్లిన పెద్ద నర్సిరెడ్డి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తాళం తెరిచేందుకు చూడగా తాళం విరిగిపోయి ఉంది. లోపలకి వెళ్లి చూడగా వస్తువులు చిందరబందరాగా పడిఉండటంతో దొంగతనం జరిగిందని తెలుసుకొని వెంటనే రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడికి చేరుకొని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీం సాయంత్రం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.