సెలవుల్లో తవ్వేశారు!
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:00 AM
మచిలీపట్నంలో మట్టి మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. పోర్టు వరకు రోడ్ కం రైలుమార్గాల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టింది. అధికారులు సంక్రాంతి సెలవుల్లో ఉండటంతో గుట్టుగా ఎక్స్ కవేటర్లు, ట్రాక్టర్లు పెట్టి మట్టి విక్రయాలు సాగించి భారీగా సొమ్ము చేసుకుంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీనరేజీ వసూలు చేసే ఏజె న్సీ ప్రతినిధులపై దాడులకు సైతం తెగబడుతుంది.
- బందరులో మట్టి మాఫియా బరి తెగింపు
- సంక్రాంతి వేళ పోర్టు రోడ్ కం రైలు మార్గం భూముల్లో తవ్వకాలు
- పోతిరెడ్డిపాలెం గ్రామం నుంచి యథేచ్ఛగా ట్రాక్టర్లలో తరలింపు
- సీనరేజీ వసూలు చేసే ఏజె న్సీ ప్రతినిధులపై ఇటీవల దాడి
- తీరప్రాంతం వైపునకు రాకుండా భయపెట్టి మరీ తవ్వకాలు
- ఆలస్యంగా విషయం వెలుగులోకి..
మచిలీపట్నంలో మట్టి మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. పోర్టు వరకు రోడ్ కం రైలుమార్గాల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టింది. అధికారులు సంక్రాంతి సెలవుల్లో ఉండటంతో గుట్టుగా ఎక్స్ కవేటర్లు, ట్రాక్టర్లు పెట్టి మట్టి విక్రయాలు సాగించి భారీగా సొమ్ము చేసుకుంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీనరేజీ వసూలు చేసే ఏజె న్సీ ప్రతినిధులపై దాడులకు సైతం తెగబడుతుంది.
ఆంధ్ర జ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం పోర్టు వరకు రోడ్ కం రైలుమార్గం నిర్మాణం కోసం ప్రభుత్వం 280 ఎకరాలకుపైగా భూమిని కొనుగోలు చేసింది. ఈ భూములకు సంబంధించి ఒకరిద్దరు మినహా మిగిలిన రైతులకు నగదు చెల్లింపులు కూడా పూర్తి చేసింది. అయితే ఇంకా రోడ్ కం రైలు మార్గం పనులు ప్రారంభించకపోవడంతో ఈ భూములపై అక్రమార్కులు కన్నేశారు. సంక్రాంతి సెలవులు రావడంతో పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పక్కనే ఉన్న గోపువానిపాలేనికి చెందిన కొందరు రాత్రి సమయంలో ఎక్స్ కవేటర్లు, ట్రాక్టర్లు పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తవ్వేసి పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్‌లోకి తరలించేశారు. పోతిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని 245, 250 సర్వే నెంబరు రోడ్ కం రైలుమార్గం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల నుంచి నాలుగు రోజుల పాటు రాత్రి సమయంలో పెద్దఎత్తున ట్రాక్టర్‌లు ఏర్పాటు చేసి మట్టిని తవ్వేశారని స్థానికులు చెబుతున్నారు.
గతంలో పోర్టు భూముల నుంచి మట్టిని తరలించిన వారే..
మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం రైతుల నుంచి ఎకరం రూ.25 లక్షల చొప్పున ధర చెల్లించి 750 ఎకరాలకుపైగా భూమిని 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) ద్వారా కొనుగోలు చేసింది. ఈ భూమి ప్రస్తుతం ఖాళీగానే ఉండటంతో ఈ భూములపై కన్నేసిన కొందరు అధికార పార్టీ నాయకులు, వైసీపీ నాయకులతో కలిసి మట్టిని తవ్వేసి విక్రయాలు జరుపుతున్నారు. ఇటీవల కాలంలో వీరి ఆగడాలు అధికం కావడంతో మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని మట్టి తవ్వకాలను కొంతమేర నిలుపుదల చేయించారు. మైనింగ్ అధికారులు తరచూ ఈ ప్రాంతంపై నిఘా పెట్టడంతో కొంత కాలం పాటు మట్టి తవ్వకాలను అక్రమార్కులు తగ్గించారు. పోర్టుకు కేటాయించిన భూముల్లో మట్టి తవ్వకాలపై నిఘా పెరగడంతో వాటిని వదిలేసి, పోర్టుకు సంబంధించిన రోడ్ కం రైలుమార్గాల నిర్మాణం కోసం ప్రభుత్వ కొనుగోలు చేసిన భూములపై పడ్డారు. ఆ భూముల్లో మట్టిని తవ్వి విక్రయించడం గమనార్హం. గతంలో ముడా భూముల నుంచి మట్టిని తవ్వి విక్రయించిన వారే, రోడ్ కం రైలు మార్గాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల్లో రాత్రి సమయంలో మట్టిని తవ్వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వారం క్రితం సీనరేజీ వసూలు చేసే ఏజెన్సీ సిబ్బందిపై దాడి
జిల్లాలో మట్టి ఇతరత్రా తవ్వకాలు జరిగితే ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించాలి. ఈ సీనరేజీని వసూలు చేసి జిల్లా నుంచి నెలకు రూ.9.50కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లించేలా ఒక ఏజెన్సీకి కాంట్రాక్టు అప్పగించినట్లు మైనింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నం నార్త్ మండలంలోని గోపువానిపాలెం, తపసిపూడి, కరగ్రహారం తదితర గ్రామాల నుంచి అనధికార మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారంతో వారం రోజుల క్రితం ఈ ఏజెన్సీకి చెందిన ఉద్యోగులు రాత్రి సమయంలో గోపువానిపాలెం గ్రామంలో తనిఖీల నిమిత్తం రాగా, వారిపై మట్టిని తవ్వే మాఫియా ముకుమ్మడిగా దాడి చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఏజెన్సీ ఉద్యోగులకు సంబంధించిన సెల్‌ఫోన్‌లు లాక్కుని, వాటిని పగులకొట్టి మరీ వారిపై దౌర్జన్యం చేసినట్లు స్థానికులు అంటున్నారు. మైనింగ్‌శాఖ అధికారులను ఈ విషయంపై వివరణ కోరగా మైనింగ్‌శాఖకు సంబంధించిన అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గాని ఆ వైపునకు వెళ్లలేదని తెలిపారు. ఏజెన్సీకి సంబంధించిన వారే వెళ్లి ఉంటారని పేర్కొంటున్నారు.
అడ్డుకట్టపడేనా!
మచిలీపట్నం నార్త్ మండలంలో సముద్రతీరం వెంబడి ఉన్న పలు గ్రామాల్లో బే ఆఫ్ బెంగాల్ భూములు, ముడా భూముల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వి తరలించేస్తున్నారు. అన్ని గ్రామాల్లో కూటమి నాయకులు, వైసీపీ నాయకుల్లోని కొందరు మాఫియాగా ఏర్పడి, ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి విక్రయాలు జరిపేస్తున్నారు. మైనింగ్ అధికారులు కొంతకాలం పాటు మిన్నకుండిపోయినా, ఆ తర్వాత నిఘాను పెంచారు. మైనింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు నిఘా పెంచడంతో వారు ఈ వైపునకు రాకుండా ఇటీవల మట్టిమాఫియా ముఠా ఏజెన్సీ ప్రతినిధులపై దాడి చేసి ఈ ప్రాంతంలో భయానక వాతావరణం సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఈ మట్టిమాఫియా ఆగడాలకు ఎంతమేర అడ్డుకట్ట వేస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.