Share News

వచ్చారు.. వెళ్లారు.. !

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:47 PM

ప్రభుత్వం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఎన్నో విధాలుగా కృషి చేస్తోంది.

వచ్చారు.. వెళ్లారు.. !

- లక్ష్యానికి విఘాతం

ఫ హాజరు వేసి విధులకు డుమ్మా

ఫ క్షేత్రస్థాయిలో కనిపించని స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు

ఫ డిప్యుటేషన్లుపై వెళ్లిన వారిదీ అదే తీరు

ఫ ప్రజలకు అందని సేవలు

ఫ ప్రభుత్వ ఆదేశాలు ఖేఖాతరు

ఫ కార్యాలయాలకే పరిమితమవుతున్న ప్రత్యేకాధికారులు

ప్రభుత్వం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఎన్నో విధాలుగా కృషి చేస్తోంది. అయితే అధికారుల నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల అలసత్వం వెరసి ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. స్వర్ణ గ్రామ, వార్డు వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కొందరు ఉద్యోగుల తీరుతో అసలు లక్ష్యానికే విఘాతం కలుగుతోంది. అలా కార్యాలయానికి వచ్చామా.. హాజరు వేసి బయట పడ్డామా.. అంతే ఇక విధులు మాకు తెలియవు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిద్రావస్థ వీడటం లేదు. మరికొందరైతే ఎక్కడో ఉండి క్లోన యాప్‌తో హాజరు నమోదు చేస్తున్నారు. కార్యాలయాలకు వివిధ పనులు బేజారెత్తి పోతున్నారు.

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఎలా ఉంటే కార్యాలయానికి వచ్చామా.. హాజరు వేశామా.. విధులకు డుమ్మా కొట్టామా అన్నట్లు తయారైంది. స్వర్ణ గ్రామ, వార్డు వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కొందరు ఉద్యోగుల తీరుతో అసలు లక్ష్యానికే విఘాతం కలుగుతోంది. ఉదయం కార్యాలయానికి వచ్చి హాజరు నమోదు చేసి ఆ తర్వాత విధులకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. మరి కొందరు సచివాలయానికి హాజరు కాకుండానే క్లోన యాప్‌ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

గంటల తరబడి వేచి చూడాల్సిన..

కొన్ని సచివాలయాల్లో ఉద్యోగుల హాజరు పరిస్థితిపై పర్యవేక్షణ కొరవడింది. ఉదయం హాజరు నమోదు చేసుకున్న తర్వాత కార్యాలయంలో కనిపించకపోవడం, ముందస్తు అనుమతి లేకుండానే బయటకు వెళ్లిపోవడం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. వివిధ సేవల కోసం సచివాలయాలకు వచ్చే ప్రజలు ఉద్యోగుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

సమయపాలన పాటించడం లేదన్న..

స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు మధ్యాహ్నం 12 తర్వాత కూడా హాజరు నమోదు చేస్తున్నారు. ఎప్పుడొచ్చినా కూడా హాజరు నమోదు కావడంతో సమయపాలన పాటించడం లేదని విమర్శలున్నాయి. వీఆర్వోలు తహసీల్దార్‌ కార్యాలయంలో తిష్ఠ వేశారు. కార్యాలయంలో వాస్తవంగా హాజరు లేకపోయినా హాజరు నమోదవుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాజరు నమోదు విధానం, ఉద్యోగి వాస్తవంగా పని చేసే ప్రదేశం, రోజువారీ పనితీరుని అధికారులు సమన్వయంతో పరిశీలించాల్సిన అవసరం ఉంది.

సచివాలయాల్లో అందుబాటులో..

గ్రామస్థాయిలో రెవెన్యూ సమస్యలు, ధ్రువపత్రాలు, భూ వ్యవహారాలు, ప్రభుత్వ పథకాల సేవల కోసం ప్రజలు స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులను ఆశ్రయిస్తున్నారు. వీఆర్వోలు, సర్వేయర్లు, ఇతర సిబ్బంది సచివాలయాల్లో అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులున్నాయి. ఫలితంగా చిన్నపాటి పనుల కోసం మండల కేంద్రాల చుట్టూ తిరగా ల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.

విధుల నిర్వహణపై స్పష్టత లేకపోవడం..

వివిధ శాఖలకు డిప్యుటేషన్లపై వెళ్లిన కొందరు ఉద్యోగుల విషయంలోనూ హాజరు, విధుల నిర్వహణపై స్పష్టత లేకుండా పోయింది. ఏశాఖకు, ఏపనిపై డిప్యుటేషన ఇచ్చారు? అక్కడ విధులకు హాజరవుతున్నారా? వారి హాజరు ఎక్కడ నమోదవుతుంది? అనే అంశాలపై అధికారులు పర్యవేక్షించాల్సింది ఉంది.

సాయంత్రం 3నుంచి 5 వరకు..

సచివాలయ ఉద్యోగులు సాయంత్రం 3 నుంచి 5గంటల వరకు ప్రజలకు అందుబాటు లో ఉండేలా తప్పనిసరి హాజరుపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులు సేవలపై స్పందించకపోతే సచివాలయ వ్యవస్థ ఉద్దేశ్యమే దెబ్బతింటుంది.

బయోమెట్రిక్‌తో పాటు అకస్మిక తనిఖీలు

ప్రతి మండలానికి స్వర్ణ, గ్రామ వార్డు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. పర్యవేక్షణ అధికారి కేవలం ఎంపీడీవో కార్యాలయానికి పరిమితమయ్యారు. మండలాల్లో ఏ సచివాలయాన్ని తనిఖీ చేసినా దాఖలాలు లేవు. మండల, డివిజన, జిల్లాస్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గైర్హాజరైన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సమయపాలన పాటించాలి

స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం 10.30 గంటలలోపు నమోదు చేయాలి. సాయంత్రం మూడు నుంచి 5 గంటల వరకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉండాలి. విధులకు డుమ్మాకొట్టి హాజరునమోదు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.

ఫ భాస్కర్‌, జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు అధికారి

Updated Date - Aug 26 , 2026 | 11:47 PM