‘ఫాస్ట్’గా దోచేస్తున్నారు!
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:21 AM
విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సెల్‌ఫోన్‌కి కొద్దిరోజుల క్రితం వరుసగా ఓటీపీలు వచ్చాయి. ఆయన క్రెడిట్ కార్డు నుంచి ఈ కామర్స్‌లో షాపింగ్ చేసినట్టు గుర్తించాడు. ఈ కార్డుతో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశారు. ఫాస్ట్ డెలివరీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని వాటిని బుక్ చేశారు. డెలివరీ సమయానికి బుక్ చేసిన వారికి సంబంధిత ఈ కామర్స్ ప్రతినిధులు ఫోన్ చేస్తే రైల్వేస్టేషన్ చిరునామా ఇచ్చారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వెళ్లి పార్సిల్‌ను తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఎంపిక చేసుకుంటున్న ఫాస్ట్ మార్గమిది.
‘ఈ’ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు
ఫోన్లను హ్యాక్ చేసి ఆన్‌లైన్ షాపింగ్
ఖరీదైన సెల్‌ఫోన్ల కొనుగోలు
డెలివరీకి బహిరంగ ప్రదేశాల చిరునామాలు
విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సెల్‌ఫోన్‌కి కొద్దిరోజుల క్రితం వరుసగా ఓటీపీలు వచ్చాయి. ఆయన క్రెడిట్ కార్డు నుంచి ఈ కామర్స్‌లో షాపింగ్ చేసినట్టు గుర్తించాడు. ఈ కార్డుతో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశారు. ఫాస్ట్ డెలివరీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని వాటిని బుక్ చేశారు. డెలివరీ సమయానికి బుక్ చేసిన వారికి సంబంధిత ఈ కామర్స్ ప్రతినిధులు ఫోన్ చేస్తే రైల్వేస్టేషన్ చిరునామా ఇచ్చారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వెళ్లి పార్సిల్‌ను తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఎంపిక చేసుకుంటున్న ఫాస్ట్ మార్గమిది.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
ప్రజలను మోసం చేసేందుకు ‘ఈ’ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తకొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ప్రజల అవగాహన లేమిని మోసాలకు అవకాశంగా మార్చుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తులో సాంకేతికతను వినియోగించుకుని నేరగాళ్లు నివసిస్తున్న నేలను గుర్తిస్తున్నారు. వారికి చాకచక్యంగా సంకెళ్లు వేస్తున్నారు. దీంతో పోలీసులకు సాంకేతికంగా చిక్కకుండా నేరగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
సేవ్ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలతో..
ఈ కామర్స్ ఫ్లాట్ ఫాంలో కొంతమంది యూజర్లు చేసే పొరపాటులను సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా వస్తువులను బుక్ చేసుకునే వారు డబ్బుల చెల్లింపునకు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. మళ్లీ షాపింగ్ చేసుకునేటప్పుడు కార్డు వివరాలు నమోదు చేసే అవకాశం లేకుండా వాటిని సేవ్ చేస్తున్నారు. ఇలా సేవ్ చేసిన వివరాలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. మరికొంత మందికి నేరగాళ్లు ఏపీకే ఫైళ్లను పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేయగానే సెల్‌ఫోన్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఫోన్ వినియోగదారుల చేతుల్లో ఉన్నా ఆపరేషన్ మాత్రం ఈ నేరగాళ్లు చేస్తున్నారు. ఈ విధంగా ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ఖరీదైన వస్తువులు బుక్ చేస్తూ..
ముఖ్యంగా ఈ నేరగాళ్లు ఖరీదైన ఫోన్లను బుక్ చేస్తున్నారు. వస్తువులను బుక్ చేసేటప్పుడు ఈ ఫ్లాట్‌ఫాంలో డెలివరీ ఎప్పుడు చేయాలన్న ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఒకటి ఫాస్ట్ డెలివరీ. దీన్నే సైబర్ నేరగాళ్లు ఎంపిక చేసుకుంటున్నారు. బుక్ చేసిన వస్తువులను డెలివరీ చేయడానికి బహిరంగ ప్రదేశాలను చిరునామాగా ఇస్తున్నారు. బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లను డెలివరీ తీసుకునే ప్రాంతాలుగా చూపిస్తున్నారు. డెలివరీ చేసే వ్యక్తులు వస్తువులను అందజేయడానికి ముందు సంబంధిత వ్యక్తులకు ఫోన్లు చేస్తారు. ఇలా ఫోన్లు వచ్చిన వెంటనే ఈ కామర్స్‌లో నమోదు చేసిన ప్రదేశానికి వెళ్లిపోతున్నారు. లేకపోతే ఆయా ప్రదేశాల వద్ద ఉన్న వ్యాపారులతో ముందే మాట్లాడుకుని డెలివరీలను అక్కడ అందజేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తర్వాత ఈ వస్తువులను వెంటనే విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారు. వస్తువులు చేతికి అందగానే నేరగాళ్లు ఆ సిమ్‌కార్డులను పక్కన పడేస్తున్నారు.
చిరునామాలు దొరక్కుండా..
సైబర్ నేరాలు ఎక్కువగా ఉత్తరాది రాషా్ట్రల నుంచే జరుగుతున్నాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సంబంధిత బ్యాంకుల నుంచి సమాచారం రప్పించుకుని డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో తెలుసుకుంటున్నారు. ఆ వస్తువులు ఏ చిరునామాకు వెళ్లాయన్న సమాచారం మాత్రం రావడం లేదు. దీంతో దర్యాప్తునకు అక్కడితో బ్రేకులు పడుతున్నాయి.