Share News

తవ్వేస్తున్నారు..!

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:58 AM

మచిలీపట్నం నార్త్‌ మండలంలోని ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ద్వితీయశ్రేణి నాయకులు కూడబలుక్కుని మరీ చెరువులు తవ్వేస్తున్నారు. లక్షలాది రూపాయల విలువైన భూములను ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులుగా మార్చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఆ వైపునకు కన్నెత్తి చూడటంలేదు. ప్రభుత్వ భూముల్లో చెరువుల తవ్వకాలు చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేస్తే.. తనిఖీలకు మేం వస్తున్నాం.. యంత్రాలను తరలించుకుపోండని రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తవ్వేస్తున్నారు..!

-పెదపట్నం, కరగ్రహారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ

- సముద్రం తీరంలో యథేచ్ఛగా రొయ్యల చెరువుల ఏర్పాటు

- అడ్డుకున్న పెదపట్నం గ్రామస్థులు

- లెక్కలేయని అక్రమార్కులు

- కరగ్రహారంలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించే భూముల విక్రయం

- వాటిలో అక్రమంగా తవ్వకాలు

- పట్టించుకోని అధికారులు

మచిలీపట్నం నార్త్‌ మండలంలోని ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ద్వితీయశ్రేణి నాయకులు కూడబలుక్కుని మరీ చెరువులు తవ్వేస్తున్నారు. లక్షలాది రూపాయల విలువైన భూములను ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులుగా మార్చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఆ వైపునకు కన్నెత్తి చూడటంలేదు. ప్రభుత్వ భూముల్లో చెరువుల తవ్వకాలు చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేస్తే.. తనిఖీలకు మేం వస్తున్నాం.. యంత్రాలను తరలించుకుపోండని రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

మచిలీపట్నం నార్త్‌ మండలం పరిధిలోని పెదపట్నం గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, బే-ఆఫ్‌ బెంగాల్‌ భూములు ఉన్నాయి. ముంబైలో తీవ్రవాదుల దాడి అనంతరం కేంద్రప్రభుత్వం తీర ప్రాంతం వెంబడి నిఘా, రక్షణ చర్యల కోసం మెరైన్‌ అకాడమీని ఈ ప్రాంతంలో రూ. 500 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మెరైన్‌ అకాడమీ నిర్మాణానికి పెదపట్నంలోని భూములను పోలీస్‌ ఉన్నతాధికారులు గతంలో పరిశీలించారు. వివిధ కారణాలతో మెరైన్‌ అకాడమీని ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంతో ఈ భూములు ఖాళీ గానే ఉండిపోయాయి.

ద్వితీయశ్రేణి నాయకుల కన్ను

సముద్రపు అంచున ఉండే ఈ ప్రభుత్వ భూములపై స్థానికంగా ఉన్న ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకుల కన్ను పడింది. ఈ ప్రాంతంలో పట్టా భూములు ఎకరం రూ.30 లక్షలకు విక్రయిస్తున్నారు. దీంతో ఈ భూములను ఆక్రమించుకుని కొందరు రొయ్యల చెరువులుగా తవ్వేసి భీమవరానికి చెందిన బడాబాబులకు లీజుకు ఇస్తున్నారు. ఇటీవల కాలంలో పెదపట్నం గ్రామంలో హెల్త్‌సెంటర్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ హెల్త్‌ సెంటర్‌ ప్రాంగణం మెరక చేయాలనే పేరుతో ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు ప్రారంభించారు. వంద ట్రాక్టర్ల లోపు మట్టిపోస్తే ఈ హెల్త్‌సెంటర్‌ ఆవరణ మెరకకు సరిపోతుంది. కానీ భారీ ఎక్స్‌ కవేటర్‌ను తెచ్చి ఐదు ఎకరాలకుపైగా భూమిని రొయ్యల చెరువులుగా తవ్వేస్తుస్తున్నారు. ఒక వైపున ఎత్తుగా చెరువు గట్లు వేస్తూనే.. అడపాదడపా ట్రాక్టర్‌లలో మట్టిని హెల్త్‌ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఇదేమని స్థానికులు ప్రశ్నించి ఈ చెరువు తవ్వకాలను అడ్డుకున్నారు. అయినా ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువుల తవ్వకాలను నిలిపి వేయలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

- ఇటీవల మాజీ సర్పంచ్‌, మరొకరు 20 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువులు తవ్వారని, వారిని ఆదర్శంగా తీసుకుని పెదపట్నం శివారు గొల్లగూడేనికి చెందిన మరో మాజీ ప్రజాప్రతినిధి ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువులను తవ్వేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

- ఇటీవల సముద్రం పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు గాను ఓ వ్యక్తి 10 ఎకరాల్లో సరుగుడు మొక్కలు, కొబ్బరి చెట్లు నాటడంతో ఈ అంశం వివాదాలకు దారితీసింది. ఈ విషయంలో ఆక్రమణదారుడు, గ్రామస్థులు దాడులు చేసుకోవడంతో విషయం పోలీస్‌ కేసు వరకు వెళ్లింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువుల తవ్వకాలు జరుపుతుండటం గమనార్హం. ప్రభుత్వ భూముల ఆక్రమణ అంశం వివాదాస్పదంగా మారుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ వైపునకు కన్నెత్తి చూడటంలేదని పెదపట్నం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించే భూములను వదల్లేదు!

కరగ్రహారం గ్రామ పంచాయతీ శివారు గౌడపాలెం గ్రామంలో ఎస్‌ఎఫ్‌సీ గూడౌన్‌ల పక్కనే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గ్రామానికి చెందిన వైసీపీ ద్వితీయశ్రేణి నాయకుడు ఒకరు ఈ భూములను గతంలో ఆక్రమించేశాడు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో గ్రామంలోని ఓ దేవత గుడికి దూపదీప నైవేద్యాల ఖర్చుల కోసం నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నట్లుగా పత్రాలు పుట్టించి, అప్పట్లో గ్రామస్థులు శాంతించేలా మాయ చేశాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 25 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని భీమవరానికి చెందిన వ్యక్తులకు వైసీపీ నాయకుడు విక్రయించేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల నుంచి అక్రమంగా విక్రయించిన భూముల్లో రొయ్యల చెరువుల తవ్వకం పనులను ప్రారంభించారు. దీంతో స్థానికులు ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు శనివారం సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు చెరువులు తవ్వే ప్రాంతానికి వచ్చే లోపుగానే ఎక్స్‌ కవేటర్‌ను అక్కడి నుంచి తరలించేశారు. కరగ్రహారం సమీపంలో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణం కోసం కేటాయించే భూములను వైసీపీ నాయకుడు దర్జాగా విక్రయించేస్తున్నా రెవెన్యూ అధికారులు మిన్నకుండి పోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేసున్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:58 AM