Share News

ముస్లిం మైనార్టీల్లో మార్పు రావాలి

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:21 AM

వైసీపీని నమ్మి మోసపోతున్న ముస్లిం మైనార్టీల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

ముస్లిం మైనార్టీల్లో మార్పు రావాలి
ఎమ్మెల్యే బుడ్డా సమక్షంలో టీడీపీలోకి చేరిన మాజీ కౌన్సిలర్‌ సుల్తాన్‌బాషా, కార్యకర్తలు

- టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

- శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

ఆత్మకూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : వైసీపీని నమ్మి మోసపోతున్న ముస్లిం మైనార్టీల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరులోని కొత్తపేటకు చెందిన మాజీ కౌన్సిలర్‌ సుల్తాన్‌ బాషాతో పాటు సుమారు 80 కుటుంబాలు ఎమ్మెల్యే బుడ్డా సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయంలోనే ముస్లింల అభ్యున్నతి సాధ్యపడుతోందని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సందర్భాల్లో ముస్లింల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండున్నర ఏళ్ల వ్యవధిలోనే రూ.1700కోట్లతో శ్రీశైల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ప్రస్తుతం కూడా ఆత్మకూరు మున్సిపాలిటీ రూ.30 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణతో పాటు రూ.150 కోట్లతో తాగునీటి పథకంతో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే బుడ్డాను గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంచర్ల గోవిందరెడ్డి, జెట్టి వేణుగోపాల్‌, రవీంద్రబాబు, కమతం శంకర్‌, శివప్రసాద్‌రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, కలిముల్లా, నజీరుద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.60లక్షలతో మాచవీరప్ప చెరువు ఆధునికీకరణ పనులు

జలధార పథకం వల్ల చెరువులకు మహర్థశ రానుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కురుకుంద గ్రామంలో జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా రూ.60లక్షల వ్యయంతో గ్రామంలోని మాచ వీరప్ప చెరువు ఆధునికీకరణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. మాచవీరప్ప చెరువును మోడల్‌ ట్యాంకుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చెరువులో పూడికతీత పనులను చేపట్టడంతో పాటు మట్టికట్టను బలోపేతం చేయనున్నట్లు వివరిం చారు. తద్వారా చెరువులో నీటి సామర్థ్యం పెరిగి రైతాంగానికి సాగునీరు సంవృద్ధిగా అందుతుందని చెప్పారు. కూటమి పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 12:21 AM